PPF Rules : పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త రూల్‌తో మరింత సులభంగా లోన్
ఈ కొత్త రూల్‌తో మరింత సులభంగా లోన్;
PPF Rules : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది మన దేశంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఒకటి. పన్ను ఆదా చేయడంతో పాటు, మంచి రాబడిని కూడా అందిస్తుంది. ప్రభుత్వం నిర్వహించే ఈ పథకంలో మనం పెట్టిన డబ్బుకు వందకు వంద శాతం గ్యారెంటీ ఉంటుంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పీపీఎఫ్ వడ్డీ రేట్లను సవరిస్తుంది. తాజాగా, ప్రభుత్వం పీపీఎఫ్ లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ మార్పుల వల్ల ఖాతాదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ముఖ్యంగా లోన్ తీసుకునే విషయంలో కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, పీపీఎఫ్ ఖాతాలో ఉన్న డిపాజిట్ల ఆధారంగా లోన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే, మీ అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బును లోన్‌గా పొందలేరు. లోన్ కోసం మీరు దరఖాస్తు చేసుకునే నాటికి, రెండేళ్ల క్రితం మీ పీపీఎఫ్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో అందులో కేవలం 25% మాత్రమే లోన్‌గా లభిస్తుంది. ఉదాహరణకు, 2023లో మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, 2021 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా లోన్ మొత్తం లెక్కిస్తారు.
పీపీఎఫ్ లోన్ తీసుకోవడం వల్ల ఉన్న మరో ముఖ్య ప్రయోజనం, దీనిపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా, పీపీఎఫ్ డిపాజిట్లపై ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు కంటే 2% అధికంగా లోన్ వడ్డీ రేటు ఉండేది. అంటే, ప్రస్తుత పీపీఎఫ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.1% అయితే, లోన్ వడ్డీ రేటు 9.1%గా ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ అదనపు వడ్డీ రేటును 2% నుంచి 1%కి తగ్గించారు. అంటే, ఇకపై లోన్ తీసుకుంటే 8.1% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది లోన్ తీసుకునేవారికి ఆర్థికంగా పెద్ద ఉపశమనం.
పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత చాలామంది ఖాతాను క్లోజ్ చేసి డబ్బును తీసుకుంటారు. అయితే, కొత్తగా వచ్చిన సవరణల ప్రకారం మెచ్యూరిటీ తర్వాత కూడా మీరు పెట్టుబడిని కొనసాగించవచ్చు. అలా చేయడం ద్వారా మీ అసలు పెట్టుబడితో పాటు వడ్డీ కూడా పెరగడం కొనసాగుతుంది. ఈ అవకాశం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల పదవీ విరమణ తర్వాత కూడా మంచి మొత్తాన్ని పొందవచ్చు.
పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు లేదా కొన్ని విడతలుగా కూడా డిపాజిట్ చేయవచ్చు. అయితే, ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఒక నెలలో ఒకసారి మాత్రమే పీపీఎఫ్ ఖాతాలో డబ్బును జమ చేయాలి. ఒకవేళ మీరు ఒక నెలలో రెండుసార్లు డిపాజిట్ చేస్తే, రెండోసారి చేసిన డిపాజిట్‌ను పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ఈ నియమాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం.