Medical Store : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. మెడికల్ షాప్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసా ?

మెడికల్ షాప్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసా ?;

Update: 2025-08-13 09:13 GMT

Medical Store : తక్కువ నష్టంతో స్థిరమైన ఆదాయం పొందగలిగే వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే మెడికల్ స్టోర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఎందుకంటే మందుల వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రోగాల సంఖ్య, చికిత్సలు పెరుగుతున్న కొద్దీ, ఈ వ్యాపారం మరింత లాభదాయకంగా మారుతోంది. మెడికల్ స్టోర్ ఎలా తెరవాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం వస్తుంది వంటి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మెడికల్ స్టోర్ ప్రారంభించాలంటే, తప్పనిసరిగా ఫార్మసీలో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. అంటే, మీరు B.Pharm లేదా D.Pharm వంటి కోర్సులు చేసి ఉండాలి. ఒకవేళ మీకు ఈ అర్హత లేకపోతే ఫార్మసీ డిగ్రీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌ను నియమించుకోవాలి. ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాప్ నడపడం చట్టవిరుద్ధం.

డ్రగ్ లైసెన్స్ తప్పనిసరి

మందుల షాప్ తెరవడానికి మీ రాష్ట్రంలోని డ్రగ్ కంట్రోలర్ ఆఫీసు నుంచి లైసెన్స్ పొందాలి. దీని కోసం ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, షాప్ మ్యాప్, ఆధార్, పాన్ కార్డులు, దుకాణం యాజమాన్య పత్రాలు లేదా అద్దె ఒప్పందం, GST రిజిస్ట్రేషన్ వంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. లైసెన్స్ లేకుండా మందులు అమ్మడం ఒక చట్టపరమైన నేరం, దీనికి కఠినమైన చర్యలు ఉంటాయి.

మెడికల్ స్టోర్ నడుపుతున్నప్పుడు, దుకాణంలోని మందుల ఎక్స్‌పైరీ డేట్ పై ఎల్లప్పుడూ దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. పొరపాటున గడువు ముగిసిన మందును అమ్మినా లేదా దుకాణంలో అలాంటి మందులు ఉన్నట్లు గుర్తించినా, భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఒక సాధారణ మెడికల్ షాప్ ప్రారంభించడానికి సుమారు 7 నుండి 10 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ ఖర్చులో మందుల తొలి స్టాక్, షాప్ ఇంటీరియర్, ఫ్రిజ్, కౌంటర్, అల్మారాలు, లైసెన్స్ ఖర్చులు ఉంటాయి. వ్యాపారం ప్రారంభించిన తర్వాత లాభాల విషయానికి వస్తే... రిటైల్‌గా మందులు అమ్మితే 20 నుండి 25 శాతం వరకు లాభం పొందవచ్చు. హోల్‌సేల్‌గా అంటే ఆసుపత్రులు, ఇతర షాపులకు మందులు సరఫరా చేస్తే లాభం 30 నుండి 40 శాతం వరకు కూడా ఉంటుంది. ఈ వ్యాపారంలో డబ్బుల చలామణి వేగంగా ఉంటుంది. రోజూ అమ్మకాలతో రోజూ ఆదాయం వస్తుంది.

సొంతంగా మెడికల్ స్టోర్ ప్రారంభించడం గురించి ఆందోళన ఉన్నవారు, ఏదైనా పెద్ద బ్రాండ్ ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. బ్రాండ్ గుర్తింపు ముందుగానే ఉండడం వల్ల కస్టమర్‌లు త్వరగా ఆకర్షితులవుతారు. తద్వారా వ్యాపారం వేగంగా పెరుగుతుంది. అలాగే, ప్రారంభంలో ఉండే నష్టాల ప్రమాదం కూడా తగ్గుతుంది. మెడికల్ స్టోర్ వ్యాపారం ఎంత లాభదాయకమో, అంతే బాధ్యతాయుతమైనది. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లైసెన్స్ సరిగా తీసుకున్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ చట్టాన్ని ఉల్లంఘించకూడదు. మందుల అమ్మకాల్లో ఏ మాత్రం అక్రమాలు జరిగినా, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.

Tags:    

Similar News