Income Tax : బంగారం, ఆస్తులు అమ్ముతున్నారా? ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడానికి అదిరిపోయే ఐడియా
ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడానికి అదిరిపోయే ఐడియా
Income Tax : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటప్పుడు పాత బంగారాన్ని లేదా ఇతర ఆస్తులను అమ్మి లాభం పొందాలని ఎవరైనా అనుకుంటారు. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. మీరు ఆస్తిని అమ్మగా వచ్చిన లాభంపై భారీగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది 12.5% నుంచి 20% వరకు ఉంటుంది. అంటే మీరు సంపాదించిన లాభంలో పెద్ద మొత్తం ప్రభుత్వానికే వెళ్ళిపోతుంది. కానీ తెలివిగా ఆలోచిస్తే రూపాయి ట్యాక్స్ కట్టకుండా ఈ డబ్బును ఆదా చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54F మనకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
సెక్షన్ 54F అంటే ఏంటి?
మీరు బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా కమర్షియల్ ప్రాపర్టీలను అమ్మి లాభం పొందినప్పుడు సెక్షన్ 54F మీకు ఉపయోగపడుతుంది. ఈ ఆస్తులను అమ్మగా వచ్చిన పూర్తి సొమ్మును మీరు ఒక నివాస గృహాన్ని కొనడానికి లేదా నిర్మించడానికి ఉపయోగిస్తే, మీరు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. ఇల్లు కొనడానికి అయితే ఆస్తి అమ్మిన ఏడాది ముందు లేదా రెండేళ్ల తర్వాత కొనుగోలు చేయాలి. ఇల్లు కట్టుకోవడానికి అయితే మూడేళ్ల సమయం ఉంటుంది. ప్రజలు ఇళ్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
ఇల్లు అమ్మి ఇల్లు కొనడానికి సెక్షన్ 54
మీరు నివసిస్తున్న ఇల్లు లేదా ప్లాట్ అమ్మినప్పుడు వచ్చే లాభానికి సెక్షన్ 54 వర్తిస్తుంది. మీరు ఒక పాత ఇల్లు అమ్మి, ఆ డబ్బుతో మరొక కొత్త ఇల్లు కొన్నా లేదా కట్టుకున్నా ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు అమ్మిన ఇంటిని కనీసం రెండు ఏళ్ల పాటు మీ దగ్గరే ఉంచుకుని ఉండాలి. ఆ తర్వాత వచ్చిన లాభాన్ని రెండు ఏళ్లలోపు కొత్త ఇల్లు కొనడానికి లేదా మూడేళ్లలోపు ఇల్లు కట్టడానికి వాడాలి. అప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది.
ప్రభుత్వం ఆస్తిని తీసుకున్నా మినహాయింపు
ఒకవేళ ప్రభుత్వం మీ ఇంటిని లేదా భూమిని స్వాధీనం చేసుకుని, మీకు పరిహారం ఇస్తే.. ఆ డబ్బుపై కూడా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఆ పరిహారం సొమ్మును కూడా పైన చెప్పిన విధంగా కొత్త ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి ఉపయోగిస్తే పన్ను మినహాయింపు లభిస్తుంది. బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో, ఆ లాభాలను ఇంటి నిర్మాణానికి మళ్లించడం ద్వారా అటు ఆస్తిని పెంచుకోవచ్చు, ఇటు ట్యాక్స్ భారాన్ని తగ్గించుకోవచ్చు.