ICICI : సామాన్యుడికి దూరమైన ఐసీఐసీఐ బ్యాంక్.. అకౌంట్ కావాలంటే రూ.50వేలు ఉండాల్సిందే

అకౌంట్ కావాలంటే రూ.50వేలు ఉండాల్సిందే;

Update: 2025-08-10 10:33 GMT

ICICI : దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆగస్ట్ 1, 2025 నుంచి కొత్తగా తెరిచే సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనను రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచింది. ఈ నిర్ణయంతో ఖాతాదారులు, సామాన్య ప్రజల నుంచి బ్యాంక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో బ్యాంక్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకున్న కనీస బ్యాలెన్స్ పెంపు నిర్ణయం, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోంది. ఈ నిబంధన కేవలం ఆగస్ట్ 1, 2025 తర్వాత కొత్తగా తెరిచే ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. పాత ఖాతాదారులకు పాత నిబంధనలే వర్తిస్తాయి. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి రూ.50,000కు పెరిగింది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ.25,000కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.2,500 నుంచి రూ.10,000కు పెరిగింది.

ఈ నిబంధనలు పాటించనివారు బ్యాలెన్స్ తక్కువ ఉన్న మొత్తంలో 6% లేదా రూ.500 - ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యంత ఖరీదైన ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటిగా మారింది. అదే సమయంలో చాలా ప్రభుత్వ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ జరిమానాను పూర్తిగా తొలగించాయి.

బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడినదని, ఇది రిచ్ పీపుల్స్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది వినియోగదారులు తమ ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలను మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News