UPI : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన నిర్ణయం
ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన నిర్ణయం;
UPI : భారతదేశంలో యూపీఐ లావాదేవీలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి నెల కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, ఈ భారీ మొత్తంలో జరిగే లావాదేవీల వల్ల బ్యాంకులపై భారం పెరుగుతోంది. అందుకే, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తరువాత ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఛార్జీలను వ్యాపారుల యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు వర్తింపజేస్తుంది. అంటే, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి సంస్థలు ఈ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు ఆగస్టు 2 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్కార్ అకౌంట్ ఉన్న అగ్రిగేటర్లకు ఒక లావాదేవీకి 2 బేసిస్ పాయింట్ల ఛార్జీ ఉంటుంది. అంటే, రూ.100 లావాదేవీకి రూ.2 ఛార్జీ పడుతుంది. ఈ ఛార్జీల గరిష్ట పరిమితి రూ.6. ఒకవేళ ఎస్కార్ అకౌంట్ లేని అగ్రిగేటర్లకు అయితే, 4 బేసిస్ పాయింట్ల ఛార్జీ ఉంటుంది. దీని గరిష్ట పరిమితి రూ.10. ఒకవేళ యూపీఐ పేమెంట్స్ తీసుకునే వ్యాపారులు ఐసీఐసీఐ బ్యాంక్‌లో అకౌంట్ కలిగి ఉండి, ఆ అకౌంట్‌కు నేరుగా సెటిల్‌మెంట్ జరిగితే, ఈ ఛార్జీల నుంచి వారికి మినహాయింపు లభిస్తుంది.
యూపీఐ లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు చాలా ఖర్చు అవుతుంది. యూపీఐ లావాదేవీలు జూలై నెలలో రికార్డు స్థాయిలో 1,947 కోట్లు జరిగాయి. మొత్తం లావాదేవీల విలువ రూ.25 లక్షల కోట్లు. ఈ భారీ సంఖ్యలో జరిగే లావాదేవీలకు సదుపాయాలు కల్పించడానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు ఎన్‌పీసీఐ అందించే యూపీఐ స్విచ్ సదుపాయానికి కూడా బ్యాంకులు ఛార్జీలు చెల్లిస్తాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి బ్యాంకులు ఇప్పుడు ఈ భారాన్ని పేమెంట్ అగ్రిగేటర్లపై వేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ అగ్రిగేటర్లు ఈ భారాన్ని వినియోగదారులపై వేసే అవకాశం లేకపోలేదు.