PAN Card : పాన్ కార్డు దారులకు అలర్ట్.. రెండ్రోజులు ఆ సేవలు బంద్
రెండ్రోజులు ఆ సేవలు బంద్;
PAN Card : కొత్తగా పాన్ కార్డు పొందాలనుకునే వారికి ముఖ్యమైన అప్‌డేట్. ఆదాయపు పన్నుల శాఖ ఒక ప్రకటనలో ఇన్‌స్టాంట్ ఈ-పాన్ సేవలు రెండు రోజుల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. పోర్టల్‌లో కొన్ని కీలకమైన టెక్నికల్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాబట్టి, అత్యవసరంగా ఈ-పాన్ అవసరమైన వారు ఈ విషయాన్ని గమనించగలరు.
ఏ రోజుల్లో ఈ-పాన్ సేవలు నిలిచిపోనున్నాయి?
ఆదాయపు పన్నుల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 17, 2025 అర్ధరాత్రి 12 గంటల నుండి ఆగస్టు 19, 2025 అర్ధరాత్రి 12 గంటల వరకు ఇన్‌స్టాంట్ ఈ-పాన్ సేవలు నిలిచిపోతాయి. ఈ రెండు రోజుల్లో కొత్తగా ఈ-పాన్ కోసం దరఖాస్తు చేసుకోవడం కుదరదు. అయితే, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మాత్రం తమ ఈ-పాన్ స్థితిని తెలుసుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ తాత్కాలిక నిలిపివేత వెనుక ఉన్న ప్రధాన కారణం పోర్టల్‌లో జరుగుతున్న సాంకేతిక అప్‌గ్రేడ్ పనులు.
ఈ-పాన్ అంటే ఏమిటి?
ఈ-పాన్ అనేది ఒక డిజిటల్ పాన్ కార్డు. దీనిని మీ ఆధార్ నంబర్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ సహాయంతో ఆన్‌లైన్‌లో తక్షణమే పొందవచ్చు. ఇది పూర్తిగా ఉచితమైన, డిజిటల్ సేవ. దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ లేదా ఫారంలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి, బ్యాంక్ ఖాతా తెరవడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డు చాలా అవసరం. ఈ-పాన్ లేనివారికి ఇది చాలా వేగవంతమైన, సులభమైన ఎంపిక. ఆదాయపు పన్నుల శాఖ ఈ సేవలు నిలిచిపోయే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని వినియోగదారులను కోరింది.