Income Tax : పన్ను భారం తగ్గేలా.. చేతికి వచ్చే ఆదాయం పెరిగేలా.. కేంద్రం సరికొత్త ప్లాన్

కేంద్రం సరికొత్త ప్లాన్

Update: 2026-02-20 11:51 GMT

Income Tax : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026 డ్రాఫ్ట్, ఉద్యోగుల పాలిట వరంగా మారబోతోంది. ముఖ్యంగా ఓల్డ్ టాక్స్ రిజీమ్ ఎంచుకునే వారికి ఈ కొత్త నిబంధనలు భారీ ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్ ఫిబ్రవరి 22 వరకు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంది. పార్లమెంటు ఆమోదం పొందితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పాత పన్ను విధానంలో మరిన్ని మినహాయింపులు లభించనున్నాయి. దీనివల్ల ఎక్కువ జీతం ఉన్నవారు పాత పద్ధతిలోనే ఉంటే వేల రూపాయల పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ కొత్త డ్రాఫ్ట్ ప్రకారం పలు భత్యాల పరిమితిని భారీగా పెంచారు. ఉదాహరణకు పిల్లల విద్యా భత్యం నెలకు కేవలం రూ.100 ఉండగా, దానిని ఏకంగా రూ.3,000కి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే హాస్టల్ అలవెన్స్ నెలకు రూ.300 నుంచి రూ.9,000కి పెరగనుంది. కంపెనీలు ఇచ్చే వడ్డీ లేని లోన్ల మినహాయింపు పరిమితిని రూ.20,000 నుంచి రూ.2 లక్షలకు పెంచడం గమనార్హం. ఆఫీసుల్లో ఇచ్చే భోజనంపై పన్ను మినహాయింపును ఒక్కో పూటకు రూ.50 నుంచి రూ.200కి, గిఫ్ట్ వోచర్ల పరిమితిని రూ.5,000 నుంచి రూ.15,000కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

హెచ్ఆర్ఏ విషయంలో కూడా కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన 50 శాతం మినహాయింపును, ఇకపై హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాలకు కూడా వర్తింపజేయనున్నారు. పాత పన్ను విధానంలో 80C, 80D వంటి సెక్షన్ల కింద పెట్టుబడులు చూపిస్తూ, ఈ పెరిగిన భత్యాల ప్రయోజనాలను కూడా పొందితే.. టాక్సబుల్ ఇన్‌కమ్ గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల నెట్ శాలరీలో ఎటువంటి మార్పు లేకపోయినా, చేతికి వచ్చే నికర ఆదాయం మాత్రం పెరుగుతుంది.

ముఖ్యంగా రూ.15 లక్షల పైన జీతం ఉన్నవారికి ఇది పెద్ద జాక్‌పాట్ అని చెప్పాలి. చార్టర్డ్ అకౌంటెంట్ల లెక్కల ప్రకారం.. రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి ఈ మినహాయింపులన్నీ వాడుకుంటే పాత పద్ధతిలో కేవలం రూ.41,496 పన్ను కడితే సరిపోతుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే దాదాపు రూ.97,500 కట్టాల్సి వస్తుంది. అంటే దాదాపు రూ.56 వేల ఆదా అన్నమాట. అలాగే రూ.20 లక్షల శాలరీ ఉన్నవారు రూ.63 వేలు, రూ.25 లక్షల శాలరీ ఉన్నవారు రూ.66 వేల వరకు అదనంగా పొదుపు చేయవచ్చు. కాబట్టి సరైన ప్లానింగ్ ఉంటే పాత పద్ధతే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News