iPhone : 45 కంపెనీలు, 3.5 లక్షల ఉద్యోగాలు.. ప్రతి 5 ఐఫోన్లలో ఒకటి ఇక్కడి నుంచే

ప్రతి 5 ఐఫోన్లలో ఒకటి ఇక్కడి నుంచే

Update: 2025-09-29 07:15 GMT

iPhone : యాపిల్ సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చైనాకు మాత్రమే పరిమితమైన యాపిల్ ఉత్పత్తి, ఇప్పుడు భారతదేశంలో గణనీయంగా పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. యాపిల్ తన గ్లోబల్ సప్లై చైన్‌లో భాగంగా 45కి పైగా కంపెనీలను భారతదేశంలో భాగం చేసింది. ఈ కంపెనీలలో కేవలం అంతర్జాతీయ దిగ్గజాలే కాకుండా, అనేక భారతీయ కంపెనీలు కూడా యాపిల్ తయారీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

యాపిల్ ఇప్పుడు కేవలం ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి పెద్ద కాంట్రాక్ట్ తయారీదారులపై మాత్రమే ఆధారపడటం లేదు. టాటా ఎలక్ట్రానిక్స్, విప్రో పారి, మదర్‌సన్, సాల్‌కామ్ప్, హిండాల్కో, భారత్ ఫోర్జ్ వంటి ప్రసిద్ధ భారతీయ కంపెనీలు ఇప్పుడు ఐఫోన్ తయారీ గొలుసులో కీలక భాగమయ్యాయి. ఇది ఒక పెద్ద మార్పు. అంతేకాకుండా, 20కి పైగా MSMEలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) కూడా యాపిల్ తయారీలో భాగమయ్యాయి.

యాపిల్ సరఫరా సప్లై చైన్‌లో చేరిన ఈ కంపెనీల ద్వారా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. వీరిలో 1.2 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఐఫోన్ల తయారీలో పనిచేస్తున్నారు. యాపిల్ భారతదేశంలో చేస్తున్న పెట్టుబడులు కేవలం టెక్నాలజీని మాత్రమే తీసుకురావడం లేదు, భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం యాపిల్ మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు 20% (అంటే ప్రతి ఐదు ఐఫోన్‌లలో ఒకటి) భారతదేశంలోనే తయారవుతోంది. ఈ గణాంకాలు PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే పెరిగాయి. తమిళనాడు, కర్ణాటకలోని కర్మాగారాల్లో ఈ ఐఫోన్‌లను తయారు చేస్తుండగా, సరఫరా గొలుసు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలకు విస్తరించి ఉంది.

యాపిల్ 2021-22 నుండి 2024-25 మధ్య భారతదేశంలో 45 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.3.75 లక్షల కోట్లు) విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. వీటిలో 76% ఐఫోన్‌లను విదేశాలకు ఎగుమతి చేసింది. దీనితో భారతదేశం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు ఇప్పుడు భారీ స్థాయికి చేరుకున్నాయి. 2015లో 167వ స్థానంలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు, ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 ఎగుమతి వస్తువుగా మారడం గమనార్హం.

Tags:    

Similar News