Green Energy: గ్రీన్ ఎనర్జీలో భారత్ గర్జన..ప్రపంచ రికార్డులు బద్ధలు..రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలదే హవా

ప్రపంచ రికార్డులు బద్ధలు..రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలదే హవా

Update: 2025-12-31 07:28 GMT

Green Energy: పర్యావరణ హితమైన ఇంధన తయారీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2025 సంవత్సరం మన దేశ క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక స్వర్ణయుగంగా నిలిచిపోనుంది. గత ఏడాది కాలంలో మనం ఉత్పత్తి చేసిన పచ్చని విద్యుత్తు గణాంకాలు చూస్తుంటే, ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా మారుతోందని అర్థమవుతోంది. ముఖ్యంగా సౌర శక్తి వినియోగంలో మనం వేసిన అడుగులు అనూహ్యమైన వృద్ధిని సాధించాయి.

భారత పునరుత్పాదక ఇంధన రంగం 2025లో మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. నవంబర్ 2025 నాటికి దేశం మొత్తం 44.5 గిగావాట్ల అదనపు గ్రీన్ ఎనర్జీని గ్రిడ్‌కు అనుసంధానించింది. 2024లో ఈ సంఖ్య కేవలం 28.7 గిగావాట్లు మాత్రమే ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే మన వృద్ధి రేటు ఏకంగా 26 శాతానికి పెరిగింది. డిసెంబర్ 2023లో 134 గిగావాట్లుగా ఉన్న మొత్తం సామర్థ్యం, ఇప్పుడు 204 గిగావాట్లకు (పెద్ద హైడ్రో ప్రాజెక్టులు కాకుండా) చేరడం విశేషం.

ఈ భారీ వృద్ధిలో సింహభాగం సౌర విద్యుత్తుదే. 2025లోని 11 నెలల్లోనే 35 గిగావాట్ల సోలార్ విద్యుత్తు గ్రిడ్‌లో చేరింది. ఇందులో మన ఇళ్లపై పెట్టుకునే రూఫ్ టాప్ సోలార్ ద్వారా 7 గిగావాట్లు, భారీ సోలార్ పార్కుల ద్వారా 26 గిగావాట్లు లభించాయి. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్ (36 GW) మొదటి స్థానంలో నిలవగా, గుజరాత్ (25 GW), మహారాష్ట్ర (17 GW), తమిళనాడు (12 GW) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గాలి మళ్ళీ మళ్లింది అన్నట్లుగా విండ్ ఎనర్జీ కూడా 6 గిగావాట్ల కొత్త సామర్థ్యాన్ని జోడించి బలంగా పుంజుకుంది.

కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం భారత్ మొత్తం ఇంధన సామర్థ్యం 254 గిగావాట్లకు చేరింది. ఇందులో సోలార్ వాటా 133 గిగావాట్లు కాగా, విండ్ ఎనర్జీ 54 గిగావాట్లుగా ఉంది. విశేషమేమిటంటే.. సోలార్ విద్యుత్ ధరలు యూనిట్‌కు కేవలం రూ.2.44 నుంచి రూ.2.55 మధ్య పలుకుతున్నాయి. బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్ కంటే ఇది ఎంతో చౌక కావడం గమనార్హం. ప్రస్తుతం మరో 135 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితో భారత్ తన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను గడువు కంటే ముందే చేరుకోనుంది.

Tags:    

Similar News