Smartphone : చైనాకు షాక్.. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో డ్రాగన్ కంట్రీని అధిగమించిన భారత్
స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో డ్రాగన్ కంట్రీని అధిగమించిన భారత్;
Smartphone : భారత్ నుండి అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌ల సరఫరా రోజురోజుకు పెరుగుతోంది. కెనాలిస్ అనే రీసెర్చ్ కంపెనీ నివేదిక ప్రకారం.. అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో భారత్, చైనాను మొదటిసారిగా అధిగమించింది. 2025 జూన్ త్రైమాసికంలో ఈ కొత్త రికార్డు నమోదైంది. దీనితో అమెరికాకు అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసే దేశంగా భారత్ నిలిచింది. కెనాలిస్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న త్రైమాసికంలో, అమెరికా దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో భారత్ వాటా 44% ఉంది. ఇదే సమయంలో చైనాలో తయారైన ఫోన్‌ల వాటా కేవలం 25% మాత్రమే. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో, అమెరికాకు సరఫరా అయిన ఫోన్‌లలో చైనా వాటా 61% ఉండగా, భారత్ వాటా కేవలం 13% మాత్రమే. అంటే, కేవలం ఒక సంవత్సరంలోనే గణనీయమైన మార్పు వచ్చింది. ఈ విజయం వెనుక ఆపిల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆపిల్ ఐఫోన్‌లు భారతదేశంలో ఎక్కువగా తయారవుతున్నాయి. ప్రస్తుతం, మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్‌లు అమెరికా మార్కెట్‌లను ముంచెత్తుతున్నాయి.
ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ల తయారీని భారీగా పెంచింది. అయితే, వారి సరికొత్త ప్రీమియం మోడల్ అయిన ఐఫోన్ 16 ప్రో ఫోన్‌లను మాత్రం ఇప్పటికీ చైనాలోనే తయారు చేస్తున్నారు. కానీ, ఐఫోన్ 16 బేస్ మోడల్‌లను ఎక్కువగా భారతదేశంలో అసెంబుల్ చేసి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నవి ఈ బేస్ మోడల్ ఫోన్లే. ఆపిల్ మాత్రమే కాదు, శాంసంగ్, మోటరోలా వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా భారతదేశంలో తమ తయారీని పెంచాయి. మోటరోలా ప్రధాన తయారీ యూనిట్లు చైనాలో ఉన్నాయి. శాంసంగ్ ఫోన్‌లు ఎక్కువగా వియత్నాంలో తయారవుతాయి. అయితే, ఈ కంపెనీలు కూడా నెమ్మదిగా భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
ఈ పరిణామం భారతదేశానికి ఒక పెద్ద విజయం. మేక్ ఇన్ ఇండియా చొరవకు ఇది ఒక సానుకూల సంకేతం. ప్రపంచ సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఇతర దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, భారతదేశం ఒక కీలక తయారీ కేంద్రంగా ఎదుగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా తయారీ రంగానికి మంచి బూస్ట్ ఇస్తుంది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు భారతదేశంలో తమ తయారీని పెంచే అవకాశం ఉంది.