Banking Sector: దేశీయ బ్యాంకింగ్ రంగంలో రాబోయే ఏడాదిన్నర కాలంలో ఊహించని నాయకత్వ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి దాదాపు ఆరు ప్రధాన బ్యాంకుల సీఈవోల పదవీకాలం 2027 నాటికి ముగియనుంది. దీంతో కొత్త సారథుల ఎంపిక ప్రక్రియ బ్యాంకు యాజమాన్యాలకు పెద్ద సవాలుగా మారింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లోనే అందరికంటే ముందుగా నాయకత్వ మార్పు జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శశిధర్ జగదీషన్ మూడేళ్ల పదవీకాలం 2026 అక్టోబర్ 26తో ముగియనుంది. తదుపరి టర్మ్ కోసం తాను పోటీపడటం లేదని ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో అంతర్గత అభ్యర్థిగా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వరుసగా 15 ఏళ్ల పదవీకాల పరిమితి ఆయనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

కొటాక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో కొత్త ముఖాలు

కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో అశోక్ వాస్వానీ తొలి మూడేళ్ల పదవీకాలం 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుంది. కొత్త నాయకుడి ఎంపిక కోసం అనూప్ సాహా, పారితోష్ కశ్యప్, జైదీప్ హన్స్ రాజ్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రెండు పేర్లను ఆర్‌బీఐ ఆమోదం కోసం బోర్డు పంపినట్లు సమాచారం. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షి పదవీకాలం ముగుస్తుండటంతో అక్కడ కూడా కొత్తవారికి అవకాశం ఇచ్చే యోచనలో యాజమాన్యం ఉంది. బ్యాంకులో ఉన్న సీనియర్ అధికారుల నుంచి కొత్త సారథిని ఎన్నుకునే వీలుంది.

ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో పరిస్థితి ఏంటి?

ఆక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి పదవీకాలం 2027 డిసెంబర్ 31 వరకు ఉంది. ఆర్‌బీఐ నిబంధనల పరిధిలోనే ఉన్న ఆయనకు మరోసారి అవకాశం దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. ఒకవేళ మార్పు ఉంటే సుబ్రత్ మొహంతి, మునీష్ శార్దా, నీరజ్ గంభీర్ పేర్లు రేసులో ఉన్నాయి. ఇక దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మూడేళ్ల పదవీకాలం 2027 ఆగస్టు నాటికి పూర్తి కానుంది. మేనేజింగ్ డైరెక్టర్ల బృందం నుంచి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియ అక్కడ ఎప్పటిలాగే పద్ధతి ప్రకారం జరగనుంది. ఐడీబీఐ బ్యాంక్ సీఈవో రాకేష్ శర్మ పదవీకాలం 2028 మార్చిలో ముగియనుండగా, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ కూడా కొత్త సీఈవోల వేటలో ఉన్నాయి.

బ్యాంకింగ్ రంగానికి ఉన్న ప్రధాన సవాళ్లు

ఫిన్‌టెక్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ పెరుగుతున్న తరుణంలో అనుభవజ్ఞులైన బ్యాంకింగ్ అధికారుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త విధానాలు తీసుకొచ్చే బయటి నిపుణులను ఎంపిక చేయాలా లేదా బ్యాంకింగ్ సంస్కృతి బాగా తెలిసిన అంతర్గత అధికారులకే బాధ్యతలు అప్పగించాలా అనే విషయమై బ్యాంకుల బోర్డులు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. స్థిరత్వం, ఆధునిక వ్యూహాల కలయికతో పనిచేసే నాయకుడి కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది.

Tags: