Donald Trump : ఐటీ రంగంపై ట్రంప్ దాడి.. వీసా ఫీజులు పెంచడంతో కంపెనీలకు భారీ నష్టం
వీసా ఫీజులు పెంచడంతో కంపెనీలకు భారీ నష్టం
Donald Trump : అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుతో భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ఒక్కో వీసా అప్లికేషన్ ఖర్చు దాదాపు రూ.83 లక్షలకు పెరిగింది. ఈ మార్పుల వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి అగ్రగామి కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ నిర్ణయం భారత ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కష్టాల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్
అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజులు ఒక్కసారిగా భారీగా పెరగడంతో భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు పెద్ద సమస్య ఎదురైంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఇప్పుడు ఒక హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఖర్చు దాదాపు రూ.83 లక్షలకు (సుమారు 100,000డాలర్లు) చేరింది. ఇది ఇంతకు ముందు ఉన్న ఖర్చుతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
ఈ నిర్ణయం వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు రాబోయే కొన్ని సంవత్సరాల్లో రూ.1,200 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ భారం నేరుగా కంపెనీల ఆదాయం, లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
వ్యాపార ఖర్చుల పెరుగుదల
భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో 85% వరకు అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. ఈ కంపెనీల ఉద్యోగులలో 3-5% మంది అమెరికాలో పనిచేస్తుంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నప్పుడు, వీసా ఖర్చులు ఇంత భారీగా పెరిగితే మొత్తం వ్యాపార నిర్వహణ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది.
ఆఫ్-షోరింగ్‌కు మొగ్గు
పెరుగుతున్న ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి కంపెనీలు ఎక్కువ పనిని భారతదేశం వంటి తక్కువ ఖర్చుతో కూడిన దేశాల నుంచి నిర్వహించాలని ప్రయత్నిస్తాయి. అంటే, ఆఫ్-షోరింగ్ పెరుగుతుంది. అయితే, అన్ని రకాల పనులను భారతదేశం నుంచి నిర్వహించడం సాధ్యం కాదు. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన పనులకు ఉద్యోగులను అమెరికాకు పంపించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు తప్పనిసరిగా భారీ వీసా ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.
కొత్త దారులు.. కొత్త ఖర్చులు
ఈ భారీ ఫీజుల వల్ల కంపెనీలు ఇప్పుడు ఎక్కువ మంది స్థానిక అమెరికన్లను నియమించుకోవడం లేదా అమెరికన్ కంపెనీలతో సబ్-కాంట్రాక్టింగ్ చేసుకోవడం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నాయి. అయితే, ఈ మార్గాలు కూడా చౌకైనవి కావు. వీటివల్ల కూడా కంపెనీల లాభాలు తగ్గుతాయి.
గతంలో ఒక హెచ్-1బీ వీసాకు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు అదే ఖర్చు రూ.83 లక్షల వరకు చేరడం అనేది ఐటీ కంపెనీలకు చాలా పెద్ద ఆర్థిక భారం. జూలై 2025 నాటికి దాదాపు 13 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టుల రెన్యూవల్స్ ఉండటంతో, ఈ కొత్త విధానం కంపెనీలకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అధిక వీసా ఖర్చులతో ఆ ప్రాజెక్టులను కొనసాగించడం లాభదాయకమా కాదా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కొత్త విధానం వల్ల భారతీయ ఐటీ రంగం లాభాలు 7-15% వరకు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు, 2023లో టీసీఎస్ 7,000 ఉద్యోగుల హెచ్-1బీ వీసాలను మంజూరు చేయించుకుంది. 2025లో వాటిని రెన్యూవల్ చేయాల్సి వస్తే, ప్రతి అప్లికేషన్‌పై అదనంగా 90,000డాలర్లు ఖర్చు అవుతుంది. ఇది టీసీఎస్ లాభాలపై 8శాతం వరకు ప్రభావం చూపుతుంది.