Stock Market : స్టాక్ మార్కెట్ బూమ్.. 10నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు
10నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు;
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఉదయం ఊహించని ర్యాలీ కనిపించింది. మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకుపైగా దూసుకెళ్లింది. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్లు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా సంపాదించారు. ఈ భారీ ర్యాలీ వెనుక కొన్ని కీలక అంతర్జాతీయ, దేశీయ అంశాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో భారత మార్కెట్లు లాభాల్లో పయనించాయి. అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల సెంటిమెంట్ మెరుగుపడింది.
1. ట్రంప్-పుతిన్ సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశం ప్రపంచ మార్కెట్లకు ఒక సానుకూల సంకేతాన్ని పంపింది. ట్రంప్ ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యాకు అనుకూలంగా మాట్లాడటం, శాంతి ఒప్పందం ముఖ్యం అని చెప్పడం వల్ల అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు పెరిగాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది.
2. చమురు ధరల తగ్గుదల
అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం వల్ల చమురు ధరలకు లభించే మద్దతు తగ్గింది. ట్రంప్-పుతిన్ సమావేశం తర్వాత రష్యా చమురు ఎగుమతులపై అమెరికా పెద్దగా ఆంక్షలు విధించకపోవడంతో చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇది కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.
3. జీఎస్టీ సంస్కరణలు
దేశీయంగా కూడా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలను చేపడతామని ప్రకటించారు. చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి వంటి ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు పెరుగుతాయని అంచనా. అందుకే ఈరోజు ఆటో రంగం స్టాక్స్‌లో భారీ ర్యాలీ కనిపించింది.
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
మార్కెట్ ర్యాలీలో సెన్సెక్స్ టాప్-30 కంపెనీలలో కూడా భారీ కదలికలు కనిపించాయి. ముఖ్యంగా ఆటో రంగం దూసుకుపోయింది. మారుతి సుజుకి షేర్లు దాదాపు 8% పెరిగాయి. అలాగే, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా లాభాల్లో పయనించాయి. అయితే, ఈ ర్యాలీలోనూ ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, సన్ ఫార్మా షేర్లు మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి.