India Forex Reserves : రూపాయి కోసం ఖర్చు.. మూడు వారాల్లో రూ.1.35 లక్షల కోట్లు మాయం!
మూడు వారాల్లో రూ.1.35 లక్షల కోట్లు మాయం!
India Forex Reserves : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే విదేశీ మారక నిల్వలు గత మూడు వారాలుగా వేగంగా పడిపోవడం ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. కేవలం మూడు వారాల వ్యవధిలోనే భారత్ యొక్క విదేశీ మారక నిల్వల నుంచి రూ.1.35 లక్షల కోట్లకు పైగా (లేదా $15.25 బిలియన్లు) తగ్గింది. రూపాయిని స్థిరీకరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడమే ఈ భారీ క్షీణతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
మూడు వారాల్లో $15.25 బిలియన్ల క్షీణత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, నవంబర్ 7తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు $2.69 బిలియన్లు తగ్గి $687.03 బిలియన్లకు చేరాయి. అంతకుముందు రెండు వారాల పతనంతో కలిపితే, ఈ మూడు వారాల కాలంలో మొత్తం $15.25 బిలియన్ల (సుమారు రూ.1.35 లక్షల కోట్లు) తగ్గుదల నమోదైంది. గత 13 నెలల క్రితం నమోదైన ఆల్ టైమ్ హై రికార్డును దాటడానికి ఈ నిల్వలు పలుమార్లు ప్రయత్నించినా, పతనం కారణంగా సాధ్యం కాలేదు.
ప్రధాన భాగాలు ప్రభావితం
తాజా గణాంకాల ప్రకారం, విదేశీ మారక నిల్వలలోని ప్రధాన భాగాలన్నింటిలోనూ క్షీణత కనిపించింది. విదేశీ కరెన్సీ ఆస్తుల భాగం $2.45 బిలియన్లు తగ్గి $562.14 బిలియన్లకు చేరింది. గోల్డ్ రిజర్వ్ కూడా $195 మిలియన్లు తగ్గి $101.53 బిలియన్లకు చేరింది. ఇదే ట్రెండ్ కొనసాగితే, గోల్డ్ రిజర్వ్ మళ్లీ $100 బిలియన్ల కంటే కిందకు పడిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ $51 మిలియన్లు తగ్గి $18.59 బిలియన్లకు చేరింది.
రూపాయి స్థిరీకరణకే ఆర్బీఐ ఖర్చు
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశ కరెన్సీ రూపాయిని స్థిరీకరించేందుకు RBI ఈ ఫారెక్స్ రిజర్వ్‌ను ఉపయోగించింది. గత కొన్ని రోజులుగా, ఫారిన్ కరెన్సీ ట్రేడర్ల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం వల్ల రూపాయి విలువ పడిపోతోంది. ఈ పతనాన్ని అరికట్టడానికి RBI మార్కెట్లో డాలర్లను విక్రయించడం ద్వారా జోక్యం చేసుకుంది. దీని కారణంగానే విదేశీ మారక నిల్వలు తగ్గాయి. అంతేకాకుండా, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ డాలర్ల కొనుగోళ్లను తగ్గించి, బంగారాన్ని కొనుగోలు చేయడంపై కూడా దృష్టి పెడుతోంది.