Forex Reserves : భారత్ భలే జోరు.. రికార్డు స్థాయికి చేరిన విదేశీ మారక నిల్వలు
రికార్డు స్థాయికి చేరిన విదేశీ మారక నిల్వలు
Forex Reserves : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఒక తీపి కబురు అందింది. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఫిబ్రవరి 27తో ముగిసిన వారానికి మన దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా 4.88 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం 728.5 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ హై మార్కుకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాలు భారత ఆర్థిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు మాత్రమే కాకుండా, దేశంలోని పసిడి నిల్వల విలువ కూడా భారీగా పెరిగింది. ఈ ఒక్క వారంలోనే బంగారం నిల్వలు 4.141 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం 131.63 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, ఆర్బీఐ వ్యూహాత్మక కొనుగోళ్లు ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద ఉండే ఎస్‌డీఆర్ నిల్వలు కూడా 18.866 బిలియన్ డాలర్లకు పెరగడం విశేషం.
విదేశీ నిల్వలు ఎందుకు ముఖ్యం?
ఏ దేశానికైనా విదేశీ మారక నిల్వలు అనేవి ఆ దేశ ఆర్థిక పటిష్టతకు కొలమానాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పడిపోకుండా అడ్డుకోవడానికి ఈ నిధులు ఆర్బీఐకి అస్త్రాల్లా పనిచేస్తాయి. ఒకవేళ డాలర్ విలువ పెరిగి రూపాయి బలహీనపడితే, ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించి మార్కెట్‌ను స్థిరీకరిస్తుంది. దీనివల్ల దిగుమతులు ప్రియం కాకుండా సామాన్యుడిపై భారం పడకుండా కాపాడవచ్చు. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఇవి దేశానికి రక్షణ కవచంలా నిలుస్తాయి.
యుద్ధ కాలంలోనూ భారత్ భళా
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో భారత్ ఈ స్థాయిలో నిల్వలను పెంచుకోవడం విశేషం. ఇది విదేశీ పెట్టుబడిదారులకు భారత మార్కెట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అంతర్జాతీయ ఆర్థిక కుదుపులు వచ్చినా తట్టుకోగల సత్తా భారత్‌కు ఉందని ఈ రికార్డు స్థాయి నిల్వలు నిరూపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ఆర్బీఐ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలే ఈ ఘనతకు కారణమని ఆర్థికవేత్తలు ప్రశంసిస్తున్నారు.