Gold Imports : రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం దిగుమతి.. దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ముప్పేంటి?

దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ముప్పేంటి?

Update: 2025-11-18 05:59 GMT

Gold Imports : ఏదైనా సరే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. అతిగా దేనిపై ఆశ పెంచుకున్నా అది అనారోగ్యానికి దారి తీస్తుంది. అక్టోబర్ నెలలో దేశ ప్రజలు బంగారం పట్ల చూపించిన దాహం కారణంగా దేశ ఆర్థిక లెక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బంగారం దిగుమతి రికార్డు స్థాయిలో పెరగడం వల్ల దేశం ట్రేడ్ డెఫిసిట్ (వాణిజ్య లోటు) రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఇది రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయగలదు. బంగారం ధరలు జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, ఇలాంటి రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఆశ్చర్యకరం. బంగారం దిగుమతి వివరాలు, దాని ప్రభావం చూద్దాం.

వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో దేశం బంగారం దిగుమతి దాదాపు మూడు రెట్లు పెరిగి 14.72 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగానే ఈ పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 2024 లో 4.92 బిలియన్ డాలర్లు ఉన్న బంగారం దిగుమతి, 2025 అక్టోబర్‌ నాటికి 3 రెట్లు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య మొత్తం దిగుమతి 21.44 శాతం పెరిగి 41.23 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బంగారం దిగుమతిలో ఈ భారీ పెరుగుదల కారణంగా దేశం వాణిజ్య లోటు (ఎగుమతి, దిగుమతి మధ్య వ్యత్యాసం) అక్టోబర్‌లో 41.68 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.29 లక్షల వద్ద ఉంది.

బంగారం దిగుమతిలో పెరుగుదల పండుగల డిమాండ్ వల్లే జరిగి ఉండవచ్చని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. భారతదేశానికి బంగారం దిగుమతిలో అతిపెద్ద వనరు స్విట్జర్లాండ్. ఇక్కడి నుంచే దాదాపు 40 శాతం దిగుమతి అవుతోంది. ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ (16 శాతం), దక్షిణాఫ్రికా (10 శాతం) ఉన్నాయి. ఈ నెలలో స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి 403.67 శాతం పెరిగి 5.08 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా తర్వాత, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. ఈ దిగుమతులు ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీరుస్తాయి.

దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు పెరిగింది. అయితే సేవల ఎగుమతి కారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (కరెంట్ ఖాతా లోటు) మాత్రం మెరుగ్గా ఉంది. 2025-26 ఏప్రిల్-జూన్ కాలంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తిలో 0.2 శాతం లేదా 2.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది 0.9 శాతం లేదా 8.6 బిలియన్ డాలర్లుగా ఉండేది.

ఒక దేశం నిర్దిష్ట కాలంలో దిగుమతి చేసుకున్న వస్తువులు, సేవలు, ఇతర చెల్లింపుల విలువ, ఎగుమతి చేసిన వస్తువులు, సేవలు, ఇతర రాబడి విలువ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కరెంట్ ఖాతా లోటు అంటారు. బంగారంతో పాటు, వెండి దిగుమతిలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 2025లో వెండి దిగుమతి ఏకంగా 528.71 శాతం పెరిగి 2.71 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలక్ట్రానిక్స్, ఆటో, ఫార్మా వంటి పారిశ్రామిక రంగాలలో వెండికి అధిక డిమాండ్ ఉంది.

Tags:    

Similar News