Insurance Hack : ప్రీమియం లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్.. ఈ టెక్నిక్ తో లక్షలు ఆదా చేస్కోండి
ఈ టెక్నిక్ తో లక్షలు ఆదా చేస్కోండి;
Insurance Hack : జీవితంలో భవిష్యత్తుకు భద్రత కావాలంటే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. కానీ, చాలా మందికి అధిక ప్రీమియం కట్టడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ప్రీమియం కడుతూ పోవడం పెద్ద భారంగా మారిపోతుంది. అయితే, ఒక పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపించారు. ప్రశాంత్ సోని అనే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పద్ధతి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ టెక్నిక్ ఉపయోగించి తాను ఏకంగా రూ. 2 కోట్ల కవరేజీ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా ఎలా పొందారో వివరించారు.
ప్రేమ్ సోని 60 సంవత్సరాల వయసు వరకు రూ. 2 కోట్ల కవరేజీ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆయనకు రెండు ఆప్షన్లను ఇచ్చారు. మొదటిది, రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ప్లాన్. దీనికి సంవత్సరానికి రూ. 31,158 ప్రీమియం. రెండోది 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు ప్లాన్. దీనికి సంవత్సరానికి రూ. 66,797 ప్రీమియం కట్టాలి.
చూడటానికి 10 సంవత్సరాల ప్లాన్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలోనే ప్రీమియం చెల్లింపు పూర్తవుతుంది. అయితే, ప్రేమ్ సోని రెగ్యులర్ ప్లాన్‌ను ఎంచుకున్నారు. అంటే, సంవత్సరానికి రూ. 31,158 చెల్లించే ప్లాన్‌ను తీసుకున్నారు. దీంతో ఆయనకు ఏటా సుమారు రూ. 30,000 ఆదా అయ్యాయి.
ఆదా అయిన రూ. 30,000ను ఆయన ఈక్విటీ SIPలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. అంటే నెలకు రూ. 2,500 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఒకవేళ ఈ ఎస్‌ఐపీ 12 శాతం సీఏజీఆర్ వృద్ధి రేటును సాధిస్తే, పదేళ్లలో ఆయన ఎస్‌ఐపీ నిధులు రూ. 5,80,847 అవుతాయి. అప్పుడు ఆయన ఎస్‌ఐపీని ఆపివేసి, సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ను మొదలుపెడతారు.
అదే సమయంలో, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బును సొంత డబ్బుతో కట్టే బదులు, ఎస్‌డబ్ల్యూపీ నుండి ఏడాదికి రూ. 30,000 విత్‌డ్రా చేసి చెల్లిస్తారు. ఇలా ఆయన 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం రూ. 30,000 విత్‌డ్రా చేసుకున్నా ఎస్‌డబ్ల్యూపీలోని డబ్బులు అస్సలు అయిపోవు. పైగా, రూ. 98 లక్షలు మిగిలి ఉంటాయి. దీనికి తోడు ఇన్సూరెన్స్ కవరేజీ అయిన రూ. 2 కోట్లు కూడా ఉంటాయి.
ఈ టెక్నిక్‌ను ఉపయోగించి ప్రేమ్ సోని ఒక కోటి రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందగలిగారు. అయితే ఈ ప్లాన్ విజయవంతం కావాలంటే ఎస్‌ఐపీలో పెట్టిన డబ్బు 12 శాతం సీఏజీఆర్ రేటుతో పెరగాలి. లేకపోతే ఆదా అయ్యే మొత్తం తక్కువగా ఉంటుంది.