Iran Israel War : ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ఓడరేవుల్లోనే కుళ్ళిపోతున్న కూరగాయలు..రైతుల ఆశలపై నీళ్లు

రైతుల ఆశలపై నీళ్లు

Update: 2026-03-05 08:51 GMT

 Iran Israel War : ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ మేఘాలు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ రైతన్నలను, ఎగుమతిదారులను కూడా వణికిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే పండ్లు, కూరగాయలు, బియ్యం సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. షిప్పింగ్ ఛార్జీలు ఆకాశాన్ని తాకడం, ప్రయాణ సమయం రెట్టింపు కావడంతో ఎగుమతిదారులు తలలు పట్టుకుంటున్నారు. యుద్ధం వల్ల రవాణా మార్గాలు మూసుకుపోవడంతో పండించిన పంటలు రేవుల్లోనే కుళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి యూరప్‌కు వెళ్లే ఉల్లి, అరటి సప్లై చైన్ దెబ్బతింది. గతంలో 20 రోజుల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సరుకు, ఇప్పుడు దారి మళ్లించడం వల్ల 45 రోజులు పడుతోంది. ఇంత ఎక్కువ కాలం సముద్ర ప్రయాణం చేస్తే ఉల్లిపాయలు పాడైపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతాయన్న భయంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ దేశాలకు పంపాల్సిన అరటి గెలలను ఇప్పుడు గత్యంతరం లేక స్థానిక మార్కెట్లలో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

రవాణా ఖర్చుల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఎయిర్ ఫ్రైట్ ఛార్జీలు 40 శాతం వరకు పెరిగాయి. బెండకాయ, సొరకాయ, బేబీ కార్న్ వంటి తాజా కూరగాయలను విదేశాలకు పంపే వారికి విమానాల్లో స్పేస్ దొరకడం గగనమైపోయింది. దొరికినా విమానయాన సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. అటు సముద్ర మార్గంలో కూడా ఇదే పరిస్థితి. సౌదీ అరేబియాకు కంటైనర్ పంపే ఖర్చు కేవలం 48 గంటల్లోనే 2,600 డాలర్లకు పెరిగిపోయింది. దీనికి అదనంగా షిప్పింగ్ కంపెనీలు వార్ సర్ఛార్జ్ పేరుతో మరిన్ని వసూళ్లు చేస్తున్నాయి.

బియ్యం ఎగుమతులపై కూడా ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సుమారు 4 లక్షల టన్నుల బియ్యం సముద్ర మార్గంలో ఉంది. ఇరాన్, యూఏఈ వైపు వెళ్తున్న ఓడలను వెనక్కి పిలవాలని లేదా వేరే దేశాల ఓడరేవులకు మళ్లించాలని ఎగుమతిదారుల సమాఖ్య సూచిస్తోంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లే సరుకుపై కూడా 20 శాతం అదనపు భారం పడింది. విదేశీ కొనుగోలుదారులు ఎక్కువ ధర ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, సరుకు క్షేమంగా చేరుతుందా లేదా అన్న గ్యారెంటీ లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ సంక్షోభం త్వరగా ముగియకపోతే భారతీయ ఎగుమతి రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలేలా ఉంది.

Tags:    

Similar News