TCS Layoff : ఐటీ ఉద్యోగులకు షాక్.. 12,000మందికి టీసీఎస్ ఉద్వాసన

12,000మందికి టీసీఎస్ ఉద్వాసన;

Update: 2025-07-29 05:17 GMT

TCS Layoff : భారతదేశపు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 2% మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. అంటే, మార్చి 2026 నాటికి టీసీఎస్ నుండి 12,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అమలు చేయడం వల్ల ఈ ఉద్యోగ నష్టం జరగడం లేదని టీసీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. టెక్నికల్ మార్పుల వేగానికి అనుగుణంగా కంపెనీ పనితీరును, టీమ్‌ల స్వభావాన్ని మార్చడంలో భాగంగానే ఈ తొలగింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ మాట్లాడుతూ, "కొత్త టెక్నాలజీలు అడుగు పెట్టాయి. పని చేసే పద్ధతులు మారుతున్నాయి. మనం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి. మేము AI ని విస్తృతంగా అమలు చేస్తున్నాము. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పరిశీలిస్తున్నాము. రీ-అసైన్‌మెంట్ వల్ల ప్రయోజనం లేని పనులు ఇంకా ఉన్నాయి. మా గ్లోబల్ ఉద్యోగుల్లో 2% మందికి సమస్య ఉంది" అని చెప్పారు.

భారతదేశపు నంబర్ వన్ ఐటీ సర్వీస్ కంపెనీ అయిన టీసీఎస్ లో ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2% అంటే సుమారు 12,200 మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవచ్చు. కంపెనీ సీఈఓ ప్రకటన ప్రకారం, ఉద్యోగాలు కోల్పోయే వారిలో ఎక్కువ మంది మిడిల్, సీనియర్ లెవల్లో ఉన్నవారే. AI వల్ల ఈ తొలగింపులు జరగడం లేదు. కానీ, భవిష్యత్ నైపుణ్యాల అవసరం నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నామని కృతివాసన్ తెలిపారు.

టీసీఎస్ కొన్ని నెలల క్రితం కొత్త బెంచ్ పాలసీని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం, ఒక ఉద్యోగి సంవత్సరంలో 225 బిలింగ్ రోజులు విధిలో ఉండాలి. 35 రోజుల కంటే ఎక్కువ బెంచ్‌లో ఉండకూడదు అనే నిబంధన ఉంది. ఇక్కడ బిలింగ్ రోజు అంటే, క్లయింట్‌లకు సేవలు అందిస్తూ, కంపెనీకి ఆదాయం తెచ్చిపెట్టే పనిలో ఉండాలి. అంటే, ఒక రోజు చేసిన పని కంపెనీకి ఆదాయాన్ని లేదా వ్యాపారాన్ని తీసుకురావాలి.

కంపెనీలోని ఏ ప్రాజెక్టులోనూ ప్లేస్ దొరకని ఉద్యోగులను బెంచ్ సిట్టర్స్ అంటారు. సంవత్సరంలో 35 రోజుల కంటే ఎక్కువ బెంచ్ సిట్టింగ్ ఉన్న ఉద్యోగులను టీసీఎస్ ఉద్యోగం నుండి తొలగిస్తోంది. ఇప్పుడు 2% తొలగింపులు ఈ కొత్త బెంచ్ పాలసీ వల్లే జరుగుతున్నాయా అనేది స్పష్టంగా తెలియదు.

Tags:    

Similar News