IT Refund Scam : ఐటీ రిఫండ్ కోసం చూస్తున్నారా? ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం

ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం

Update: 2026-02-23 05:51 GMT

IT Refund Scam : ఆదాయపు పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్రుతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే ఒక పన్ను చెల్లింపుదారుడు 'మీ రిఫండ్ ఆగిపోయింది.. వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి' అనే నకిలీ మెసేజ్‌ను నమ్మి ఏకంగా రూ.1.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది కాలంగా రిఫండ్ రావడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సాకుగా చూపుతూ ఈ కొత్త రకం 'ఫిషింగ్' స్కామ్‌లకు తెరలేపారు.

అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?

ఈ మోసం సాధారణంగా ఒక ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్‌తో మొదలవుతుంది. "మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ పెండింగ్‌లో ఉంది, వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే ఈ సొమ్ము వెనక్కి వెళ్లిపోతుంది" అని ఆ మెసేజ్ సారాంశం. అందులో ఒక లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే అది అచ్చం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లాగే ఉండే ఒక నకిలీ పోర్టల్‌కు మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ మీ పాన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అది పూర్తి చేయగానే ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసిన మరుక్షణమే మీ బ్యాంక్ ఖాతా నియంత్రణ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

జనం ఎందుకు మోసపోతున్నారు?

ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, డేటా సరిపోలని పక్షంలో లేదా వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు రిఫండ్ ఆలస్యమవుతుంది. ఈ విషయం తెలిసిన పన్ను చెల్లింపుదారులు, తమ రిఫండ్ ఎక్కడ ఆగిపోయిందో అన్న కంగారులో స్కామర్లు పంపే అర్జెంట్ రిమైండర్ మెసేజ్‌లను చూసి భయపడిపోతున్నారు. కేటుగాళ్లు వాడే భాష కూడా చాలా గంభీరంగా, అది నిజమైన నోటీసులాగే అనిపించేలా ఉంటుంది. ఈ టెన్షన్‌లో లింక్ క్లిక్ చేయడమే బాధితులు చేస్తున్న పెద్ద తప్పు.

ఐటీ శాఖ ఏం చేయదు.. ఏం చేస్తుంది?

పన్ను చెల్లింపుదారులు కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ కూడా ఎస్ఎంఎస్ ద్వారా రిఫండ్ వెరిఫికేషన్ లింక్‌లను పంపదు. ఫోన్ కాల్స్ చేసి లేదా మెసేజ్‌ల ద్వారా మీ ఓటిపి గానీ, బ్యాంక్ వివరాలు గానీ అడగదు. మీ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవాలంటే కేవలం అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ కు వెళ్లి మాత్రమే లాగిన్ అవ్వాలి. ఎవరో పంపిన లింక్‌ల మీద క్లిక్ చేసే బదులు, బ్రౌజర్‌లో నేరుగా వెబ్‌సైట్ అడ్రస్ టైప్ చేసి చెక్ చేసుకోవడం సురక్షితం.

మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

మీకు అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే దాన్ని ఇగ్నోర్ చేయండి. పొరపాటున కూడా మీ లాగిన్ వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ రిఫండ్ స్టేటస్ కోసం ఎప్పుడూ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్‌ను మాత్రమే నమ్మండి. ఒకవేళ మీరు ఇలాంటి ఫిషింగ్ ప్రయత్నాలను గమనిస్తే, వెంటనే ఐటీ శాఖ అధికారిక గ్రీవెన్స్ సెల్‌కు లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కు ఫిర్యాదు చేయండి. అప్రమత్తంగా ఉంటేనే మీ కష్టార్జితాన్ని సైబర్ దొంగల బారి నుంచి కాపాడుకోగలరు.

Tags:    

Similar News