Liquor News : టకీలా, విస్కీలో కొత్త రుచులు..ఇండియా మార్కెట్‌పై అమెరికా దిగ్గజం కన్ను

ఇండియా మార్కెట్‌పై అమెరికా దిగ్గజం కన్ను

Update: 2026-03-06 06:53 GMT

Liquor News : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన విస్కీ బ్రాండ్ జాక్ డానియల్స్ తయారీ సంస్థ బ్రౌన్-ఫోర్మన్, ఇప్పుడు భారత మార్కెట్‌పై కన్నేసింది. అమెరికాకు చెందిన ఈ దిగ్గజ మద్యం కంపెనీ, రాబోయే రెండు మూడు ఏళ్లలో భారత్‌లో తన ప్రీమియం బ్రాండ్ల సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని గట్టిగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం భారతీయుల ఆదాయం పెరగడం, మారుతున్న జీవనశైలి కారణంగా విదేశీ బ్రాండ్లకు గిరాకీ విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

త్వరలో కొత్త బ్రాండ్ల జాతర

భారతీయ మందు బాబులకు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు బ్రౌన్-ఫోర్మన్ సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న జాక్ డానియల్స్‌తో పాటు, రాబోయే రోజుల్లో ఎల్ జిమాడార్, హెరాదురా వంటి ప్రసిద్ధ టకీలా బ్రాండ్లను, అలాగే బెన్రియాచ్ విస్కీని కూడా భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం కంపెనీ భారత్‌లో సుమారు 10 రకాల బ్రాండ్లను విక్రయిస్తుండగా, మరో మూడు నాలుగు కొత్త బ్రాండ్లను జోడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిన్ మేర్, ఉడ్‌ఫోర్డ్ రిజర్వ్ వంటి లగ్జరీ డ్రింక్స్‌ను ఇప్పటికే అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత భారీగా మార్చబోతోంది.

చైనాను వెనక్కి నెట్టేయనున్న భారత్

మద్యం విక్రయాల విషయంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టించబోతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డ్రింక్స్ మార్కెట్ విశ్లేషణ సంస్థ IWSR నివేదిక ప్రకారం.. 2032 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా స్పిరిట్స్ వినియోగించే దేశంగా భారత్ అవతరించనుంది. ఈ క్రమంలో భారత్ పొరుగు దేశమైన చైనాను కూడా వెనక్కి నెట్టేయనుంది. ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది కొత్త కస్టమర్లు మద్యం మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారని, ఇది అంతర్జాతీయ కంపెనీలకు పెద్ద వరమని బ్రౌన్-ఫోర్మన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ సబర్వాల్ వెల్లడించారు.

సవాళ్లు ఉన్నా.. తగ్గేదే లే

భారత మార్కెట్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇక్కడ వ్యాపారం చేయడం అంత సులభం కాదని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన మద్యం విధానం ఉండటం, భారీగా పన్నులు , ప్రకటనలపై కఠినమైన నిబంధనలు వంటివి విదేశీ కంపెనీలకు సవాలుగా మారుతున్నాయి. అయినప్పటికీ పెరిగిన కొనుగోలు శక్తి, ప్రీమియం బ్రాండ్ల పట్ల భారతీయులకు పెరుగుతున్న మక్కువను చూస్తుంటే.. భారత్ రాబోయే రోజుల్లో తమకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ మార్కెట్‌గా మారుతుందని బ్రౌన్-ఫోర్మన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News