Tax Tips : ట్యాక్స్ టెన్షన్ లేకుండా పాత కంపెనీ డబ్బును విత్ డ్రా చేయడం ఎలా? నిపుణుల సీక్రెట్ ఫార్ములా ఇదే

నిపుణుల సీక్రెట్ ఫార్ములా ఇదే

Update: 2026-01-28 13:36 GMT

Tax Tips : సాధారణంగా ఉద్యోగం మారినప్పుడు కొత్త జీతం, కొత్త హోదా మీద ఉండే శ్రద్ధ.. పాత కంపెనీలో ఉన్న పొదుపు మొత్తం మీద ఉండదు. కానీ అక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది. సరైన అవగాహన లేకుండా పాత కంపెనీలో ఉన్న సూపర్ యాన్యుయేషన్ లేదా గ్రాట్యుటీ డబ్బును విత్ డ్రా చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం ఖాయం. మీరు కష్టపడి దాచుకున్న సొమ్ము పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని సీక్రెట్ ఫార్ములాలు పాటించాలని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.

చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు జీతం పెరిగినప్పుడు వెంటనే కంపెనీలు మారుతుంటారు. ఈ క్రమంలో పాత కంపెనీలో జమైన సూపర్ యాన్యుయేషన్, గ్రాట్యుటీ నిధులను ఏం చేయాలో తెలియక విత్ డ్రా చేసేస్తుంటారు. ఆదాయపు పన్ను నిపుణుడు అమిత్ మహేశ్వరి ప్రకారం, ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరిగి, మీరు అధిక ట్యాక్స్ స్లాబ్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(13) ప్రకారం, రిటైర్మెంట్ సమయంలో వచ్చే సూపర్ యాన్యుయేషన్ మొత్తానికి పన్ను ఉండదు. కానీ ఉద్యోగం మధ్యలో ఆ డబ్బును తీసుకుంటే మాత్రం అది మీ వార్షిక ఆదాయానికి చేర్చబడుతుంది. దీనికి పరిష్కారం ఒక్కటే.. ఆ నిధులను కొత్త కంపెనీకి చెందిన అప్రూవ్డ్ ఫండ్ కు లేదా మీ ఎన్పీఎస్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయడం. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.

గ్రాట్యుటీ విషయానికి వస్తే.. ఇక్కడ రూల్స్ కొంచెం భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 10(10) ప్రకారం ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని ట్యాక్స్ లేకుండా పొందవచ్చు. అయితే, మీరు పని చేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల జీతం లెక్కన ఈ మినహాయింపు వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తం వస్తే మాత్రం ఖచ్చితంగా పన్ను కట్టాలి. అందుకే ఉద్యోగం మారినప్పుడు ఈ లెక్కలు వేసుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున ఈ డబ్బును చేతికి తీసుకుంటే, ఆ ఏడాది మీ ట్యాక్స్ భారం విపరీతంగా పెరిగిపోతుంది.

ఇక పెట్టుబడుల విషయానికి వస్తే.. చాలామందికి ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మధ్య ఏది బెటర్ అనే సందేహం ఉంటుంది. పెట్టుబడి సలహాదారు రుషభ్ దేశాయ్ అభిప్రాయం ప్రకారం.. పాత ట్యాక్స్ విధానంలో ఉండేవారికి సెక్షన్ 80CCD కింద అదనంగా రూ.50,000 ఆదా చేసుకోవడానికి ఎన్పీఎస్ మంచి మార్గం. కానీ, దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించాలనుకునే వారికి మాత్రం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మిన్న. ఎందుకంటే ఎన్పీఎస్ లో కొంత మొత్తం కచ్చితంగా యాన్యుయేషన్ లోనే ఉంచాలి, అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

అలాగే, యూలిప్ వంటి ప్లాన్ల విషయంలో నిపుణులు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఇవి అటు ఇన్సూరెన్స్ కు, ఇటు ఇన్వెస్ట్‌మెంట్‌ కు రెండింటికీ పనికిరావని, వీటిలో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే బీమా కోసం టర్మ్ ప్లాన్, పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ విడివిడిగా ఉంచుకోవడం ఉత్తమ వ్యూహం. ఉద్యోగం మారిన ప్రతిసారీ మీ పోర్ట్‌ఫోలియోను ఒకసారి రివ్యూ చేసుకుంటే, మీ రిటైర్మెంట్ కాలం నాటికి భారీ నిధిని కూడబెట్టుకోవచ్చు.

Tags:    

Similar News