Microsoft : మనిషి మలమూత్రాలు కొంటున్న మైక్రోసాఫ్ట్.. టన్నుకు ఏకంగా రూ.30,000 పైనే

టన్నుకు ఏకంగా రూ.30,000 పైనే;

Update: 2025-07-29 05:15 GMT

Microsoft : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పుడు మనుషుల మల, మూత్ర వ్యర్థాలను డబ్బులిచ్చి కొనుగోలు చేస్తోంది. ఒక టన్ను వ్యర్థానికి 350 డాలర్లు, అంటే సుమారు రూ.30,000 చెల్లిస్తోంది. వోల్టెడ్ డీప్ అనే కంపెనీతో 12 సంవత్సరాల డీల్ చేసుకుంది. మొత్తం 4.9 మిలియన్ మెట్రిక్ టన్నుల సేంద్రియ వ్యర్థాలను సేకరించనుంది. ఇందుకోసం అది మొత్తం 1.7 బిలియన్ డాలర్లు లేదా రూ.14-15 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ఆవు పేడ గ్యాస్ వ్యాపారంలోకి దిగిందా అని అనుమానం రావచ్చు. కానీ, వ్యర్థాలను కొనుగోలు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం వేరే ఉంది.

మైక్రోసాఫ్ట్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. 2020 నుండి 2024 వరకు ఈ కంపెనీ 75.5 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలకు కారణమైంది. ప్రపంచ పర్యావరణ నియమ నిబంధనల ప్రకారం, కంపెనీలు వాయు కాలుష్యాన్ని ఎంత ఎక్కువగా విడుదల చేస్తే, దానికి తగ్గట్టుగా కాలుష్య నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ 2030 నాటికి కార్బన్ నెగటివ్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా అది వోల్టెడ్ డీప్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది.

వోల్టెడ్ డీప్ కంపెనీ రీసైకిల్ చేయడం కష్టమైన జీవ వ్యర్థాలను సేకరించి, వాటిని భూమిలోకి 5,000 అడుగుల లోతుకు పైపుల ద్వారా పంపిస్తుంది. అప్పుడు ఈ జీవ వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియ ఆగిపోతుంది. దీని వల్ల మీథేన్ , కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల కాకుండా నియంత్రించబడతాయి. ఈ విధంగా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. మైక్రోసాఫ్ట్ వంటి ఆధునిక టెక్ కంపెనీలు పనిచేయాలంటే, పర్యావరణ కాలుష్యానికి దారితీసే ప్రక్రియలు అనివార్యం. తమ కార్యకలాపాల వల్ల జరిగే కాలుష్యాన్ని ఇతర మార్గాల ద్వారా తగ్గించడానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసమే కార్బన్ క్రెడిట్ వ్యవస్థ ఉంది. పర్యావరణానికి మేలు చేసే పనులకు డబ్బు ఖర్చు చేసి కార్బన్ క్రెడిట్‌లు సంపాదించవచ్చు.

Tags:    

Similar News