Tariff War : మోదీ నా దోస్తే..కానీ పన్నులు కట్టాల్సిందే..ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇండియాఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Update: 2026-02-21 06:06 GMT

Tariff War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీంకోర్టు తన టారిఫ్ నిర్ణయాలను రద్దు చేసినప్పటికీ, భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పినా సరే.. భారత్ 18 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే, మేము మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టము అని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణిస్తూనే, వ్యాపార ప్రయోజనాల దగ్గర తగ్గేదే లేదని సంకేతాలిచ్చారు.

ప్రధాని మోదీతో తన సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతూనే, గతంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ స్పందించారు. తన విన్నపం మేరకే భారత్ రష్యాతో సంబంధాలను తగ్గించుకుందని, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు మోదీ సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు. అలాగే గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, టారిఫ్‌ల భయంతోనే తాను ఆ యుద్ధాన్ని ఆపగలిగానని ట్రంప్ చెప్పుకొచ్చారు. మీరు యుద్ధం చేస్తే అమెరికాతో వ్యాపారం ఉండదు, ప్రతి దేశం 200% పన్ను కట్టాలి అని తాను హెచ్చరించడంతోనే శాంతి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి గతంలో భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 50 శాతం పన్ను వేయగా, ఒప్పందం ప్రకారం దానిని 18 శాతానికి తగ్గించారు. దీనికి ప్రతిగా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై భారత్ సున్నా పన్ను విధించడానికి అంగీకరించింది. మార్చి నెలాఖరు కల్లా ఈ ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉంది. అమెరికాలోని టెక్స్‌టైల్స్, లెదర్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి రంగాలపై 18 శాతం పన్ను విధిస్తుండగా, అమెరికా నుంచి వచ్చే ధాన్యాలు, పండ్లు, సోయాబీన్ ఆయిల్, మద్యం వంటి వాటిపై భారత్ పన్నులను భారీగా తగ్గించనుంది.

అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ తీర్పు తనను తీవ్రంగా నిరాశపరిచినట్లు ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అయితే భారత్‌తో ఉన్న ఒప్పందం మాత్రం న్యాయబద్ధమైనది అని, ఇది ఇరు దేశాలకు మేలు చేసేదని ఆయన సమర్థించుకుంటున్నారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 18 శాతం పన్ను బాదుడు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News