Share Market : షేర్ మార్కెట్లో తుఫాన్ రాబోతుందా ? సెన్సెక్స్ లక్ష మార్క్ దాటుతుందా ?
సెన్సెక్స్ లక్ష మార్క్ దాటుతుందా ?;
Share Market : గ్లోబల్ టెన్షన్స్, మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత షేర్ మార్కెట్ గురించి ఒక సంచలన అంచనా వేసింది. సెన్సెక్స్ 2026 నాటికి లక్ష మార్క్‌ను దాటవచ్చని ఈ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, ఇది మార్కెట్ బాగా వృద్ధి చెందితే (బెస్ట్ బుల్ కేస్) మాత్రమే సాధ్యమవుతుందని తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ ఆగస్టు 4న ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ ప్లేబుక్ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత షేర్ మార్కెట్‌కు మూడు రకాల అంచనాలను ఇచ్చింది. అవి బేస్ కేస్, బుల్ కేస్, బియర్ కేస్. ఇందులో బేస్ కేస్ సాధారణ పరిస్థితుల్లో మార్కెట్ ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. బుల్ కేస్ మార్కెట్ బాగా వృద్ధి చెందితే ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. బియర్ కేస్ మార్కెట్ పడిపోతే ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది.
మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు రిద్ధమ్ దేశాయ్, నయంత్ పరేఖ్ ఈ నివేదికను తయారు చేశారు. భారత షేర్ మార్కెట్ మరోసారి రీ-రేటింగ్ అవుతుందని, భవిష్యత్తులో చాలా బలమైన వృద్ధి ఉంటుందని ఈ నివేదిక సూచిస్తోంది. భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న జనాభా, మెరుగైన మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం వంటి అంశాలు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద శక్తిగా నిలబెడతాయని నివేదిక పేర్కొంది.
మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, సెన్సెక్స్ లక్ష మార్క్‌ను చేరుకునేందుకు 30శాతం అవకాశం ఉంది. ఇది నిజం కావాలంటే కొన్ని కీలక పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల కంటే తక్కువగా ఉండాలి. అమెరికాతో వ్యాపార ఒప్పందం కుదరాలి. భారత ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం, వ్యవసాయ చట్టాలలో సంస్కరణలు తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించాలి. ఈ అన్ని అంశాలు కలిస్తే, జూలై 2026 నాటికి సెన్సెక్స్ లక్ష మార్కును అందుకోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.