FASTag : ఆగస్టు 15 నుంచి అమల్లోకి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఈ విషయం తెలుసుకోండి
ఈ విషయం తెలుసుకోండి;
FASTag : ప్రతిరోజూ ప్రయాణించేవారి కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను తీసుకువచ్చింది. ఇది ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరి కాదు. ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుంది. యాన్యువల్ పాస్ తీసుకోవాలనుకోని వారు, ఎప్పటిలాగే తమ ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించవచ్చు. అయితే, ఈ కొత్త పాస్‌ను తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు, నియమాలు తెలుసుకోవాలి.
యాన్యువల్ పాస్ ఎవరు తీసుకోలేరు?
* కొత్త పాస్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీ పాత ఫాస్టాగ్ నే ఉపయోగించవచ్చు. కానీ దీనికి కొన్ని షరతులు ఉన్నాయి:
* మీ వాహనం VAHAN డేటాబేస్‌లో చెల్లుబాటు అయ్యేదిగా ఉండాలి.
* ఫాస్టాగ్ మీ కారు విండ్‌షీల్డ్‌పై సరిగ్గా అతికించి ఉండాలి.
* మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు.
* ఒకవేళ మీ ఫాస్టాగ్‌లో రిజిస్టర్ నంబర్ కాకుండా కేవలం ఛాసిస్ నంబర్ మాత్రమే ఉంటే, దానిపై యాన్యువల్ పాస్ జారీ చేయబడదు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ నంబర్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి.
ఏ వాహనాలు అర్హత కలిగి ఉంటాయి?
ఈ వార్షిక పాస్ కేవలం ప్రైవేట్ నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనిని యాక్టివేట్ చేయడానికి ముందు ఫాస్టాగ్‌ను VAHAN డేటాబేస్‌తో ధృవీకరిస్తారు. ఒకవేళ కమర్షియల్ వాహనాలు దీన్ని వాడితే, ఎలాంటి నోటీస్ లేకుండానే పాస్ రద్దు చేస్తారు.
ఈ పాస్‌ను ఎక్కడ ఉపయోగించవచ్చు?
ఈ పాస్ కేవలం నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలచే నిర్వహించబడే స్టేట్ హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వేలపై దీనిని ఉపయోగిస్తే, ప్రత్యేకంగా యూజర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర నిబంధనలు, గడువు..
ఇతరులు వాడొచ్చా? ఈ పాస్‌ను ఇతరులకు ట్రాన్సఫర్ చేయడం కుదరదు. ఫాస్టాగ్ ఏ కారుకు రిజిస్టర్ అయి ఉందో ఆ కారుకు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. వేరే వాహనానికి వాడితే పాస్ వెంటనే రద్దవుతుంది. పేమెంట్ కన్ఫర్మ్ అయిన వెంటనే (2025-26 సంవత్సరానికి రూ.3,000) ఈ పాస్ సాధారణంగా రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుంది. ఈ పాస్ ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్‌లు (ఏది ముందు పూర్తయితే అది) వరకు చెల్లుబాటు అవుతుంది. లిమిట్ పూర్తయిన తర్వాత ఈ పాస్ ఆటోమేటిక్‌గా సాధారణ ఫాస్టాగ్‌గా మారిపోతుంది.