New GST Rates: సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి.. సెలూన్లు, జిమ్‌లు చౌక, ఫుడ్ ఆర్డర్లు భారం
సెలూన్లు, జిమ్‌లు చౌక, ఫుడ్ ఆర్డర్లు భారం
New GST Rates: సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌లో మార్పులు రాబోతున్నాయి. కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయి. మరికొన్నింటికి ఖర్చు పెరుగుతుంది. ఉదాహరణకు.. మీరు సెలూన్, జిమ్, లేదా యోగా సెంటర్లకు వెళితే, మీ బిల్లులు తగ్గుతాయి. ఇప్పుడు ఈ సేవలపై 5% జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు 18% ఉండేది. దీనివల్ల రూ. 2,000 బిల్లుపై దాదాపు రూ. 260 ఆదా అవుతుంది.
నిత్యావసరాలు చౌక
కొత్త జీఎస్టీ రేట్ల వల్ల టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ, షేవింగ్ క్రీమ్, టూత్‌బ్రష్‌లు, ఫేస్ పౌడర్ వంటి నిత్యావసరాలు కూడా చౌకగా మారాయి. ఇవి ఇప్పుడు 5% జీఎస్టీ శ్లాబ్‌లోకి వచ్చాయి. అంతేకాకుండా, కళ్లద్దాలపై పన్ను కూడా 5%కి తగ్గింది. సైకిళ్లు, వాటి విడిభాగాలపై కూడా 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గింది. దీనివల్ల ఈ వస్తువులు కొనుగోలు చేసేవారికి డబ్బు ఆదా అవుతుంది.
ఫుడ్ డెలివరీ భారం
అయితే, ఆన్‌లైన్‌లో తరచుగా ఫుడ్ ఆర్డర్ చేసేవారికి ఇది కొంత భారం. జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే, డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ అదనంగా పడుతుంది. దీనివల్ల ఒక్కో ఆర్డర్‌పై రూ. 2 నుంచి రూ. 2.6 వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ భారం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పుల వల్ల కొన్నింటిపై ఆదా చేస్తే, మరికొన్నింటిపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు.