NPS Gratuity Rules : న్యూ ఇయర్ ఉద్యోగులకు షాక్.. గ్రాట్యుటీ నిబంధనల్లో పెను మార్పులు

గ్రాట్యుటీ నిబంధనల్లో పెను మార్పులు

Update: 2026-01-01 08:40 GMT

NPS Gratuity Rules : కొత్త ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన షాక్ ఇచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల గ్రాట్యుటీ నిబంధనలను మారుస్తూ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా ఒకసారి రిటైర్ అయ్యి మళ్ళీ విధుల్లో చేరిన వారికి, సైన్యం నుంచి సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చిన వారికి ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. గ్రాట్యుటీ అనేది ఇకపై కేవలం వన్ టైమ్ బెనిఫిట్ మాత్రమేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26, 2025న విడుదల చేసిన కొత్త మెమోరాండం ప్రకారం, గ్రాట్యుటీని ఇకపై వన్ టైమ్ టెర్మినల్ బెనిఫిట్‎గా పరిగణిస్తారు. అంటే ఒక ఉద్యోగి తన సేవా కాలం ముగిశాక పొందే తుది ప్రయోజనం ఇది. ఎవరైనా ఉద్యోగి గతంలో రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు లేదా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినప్పుడు ఇప్పటికే గ్రాట్యుటీ పొంది ఉంటే, వారు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు రెండోసారి గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు కారు. ఒకే వ్యక్తికి వేర్వేరు సేవా కాలాలకు గాను పదే పదే గ్రాట్యుటీ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిబంధన ప్రధానంగా మాజీ సైనికులకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. సాధారణంగా సైన్యం నుంచి చిన్న వయసులోనే రిటైర్ అయ్యే జవాన్లు, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌లో లేదా ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో చేరుతుంటారు. ఇప్పటివరకు వీరు తమ సైనిక సేవకు ఒకసారి, సివిల్ సేవకు మరోసారి గ్రాట్యుటీ పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం, మిలిటరీ సర్వీస్ సమయంలో గ్రాట్యుటీ తీసుకున్న వారు, రెండోసారి సివిల్ సర్వీస్ రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ గ్రాట్యుటీని క్లెయిమ్ చేయలేరు. దీనిపై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

అయితే, అందరికీ ఈ రూల్ ఒకేలా వర్తించదు. ఎవరైనా ఉద్యోగి మొదట పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ లేదా ఏదైనా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో పనిచేసి, అక్కడి నుంచి గ్రాట్యుటీ పొంది.. సరైన అనుమతులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తే వారికి మినహాయింపు ఉంటుంది. వారు కేంద్ర ప్రభుత్వ సేవకు గాను గ్రాట్యుటీ పొందవచ్చు. కానీ, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. రెండు చోట్లా కలిపి తీసుకునే మొత్తం గ్రాట్యుటీ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి ఉండకూడదు. అంటే రెండు ప్రయోజనాలు కలిపినా అది లిమిట్ లోనే ఉండాలి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వదిలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారి విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ సేవలో గ్రాట్యుటీ తీసుకున్న వారు, కేంద్ర ఉద్యోగంలో రిటైర్ అయినప్పుడు మిగిలిన సేవకు గాను గ్రాట్యుటీ పొందవచ్చు. అయితే, గత సర్వీస్, ప్రస్తుత సర్వీస్ రెండింటినీ కలిపి లెక్కించినప్పుడు వచ్చే మొత్తం గ్రాట్యుటీ, కేంద్రం విధించిన గరిష్ట పరిమితిని మించకూడదు. ఈ నిబంధనల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, గ్రాట్యుటీ పంపిణీలో పారదర్శకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News