Pakistan : పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఏకంగా రూ. 140 కోట్లు నష్టం
ఏకంగా రూ. 140 కోట్లు నష్టం
Pakistan : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. కానీ అసలు వివాదం మ్యాచ్ ముగిసిన తర్వాతే మొదలైంది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటారు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు. భారత ఆటగాళ్లు తమతో చేతులు కలపకపోవడంపై పాకిస్థాన్‌కు చాలా కోపం వచ్చింది. దీనిని అవమానంగా భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వెంటనే అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసింది. పీసీబీ మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐసీసీ నుంచి వచ్చిన సమాధానంపై సంతకం చేసిన వ్యక్తి వసీమ్ ఖాన్, గతంలో పీసీబీ సీఈఓగా పనిచేశారు. ఇప్పుడు ఐసీసీ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
ఈ నిర్ణయంతో పాకిస్థాన్ మరింత ఆగ్రహం చెందింది. ఇప్పుడు పీసీబీ తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆసియా కప్ 2025 నుంచి వైదొలుగుతామని బెదిరిస్తోంది. ఈ పరిస్థితిలో పాకిస్థాన్ నిజంగా టోర్నమెంట్‌ను బాయ్‌కాట్ చేస్తే ఎంత నష్టం జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. ఒక నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ ఆసియా కప్ 2025ను బాయ్‌కాట్ చేస్తే వారికి 16 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.140 కోట్లు నేరుగా నష్టం జరుగుతుంది. పీసీబీ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ మొత్తం వారికి చాలా పెద్దది. ఒకవేళ పాకిస్థాన్ వైదొలిగితే, వారికి డబ్బు నష్టంతో పాటు ఆటగాళ్ల జీతాలు, దేశీయ టోర్నమెంట్లు, ఇతర సన్నాహాలపై కూడా ప్రభావం పడుతుంది.
భారత ఆటగాళ్లు ఎందుకు చేతులు కలపలేదు?
ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఈ నిర్ణయం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా అని అడిగినప్పుడు.. "కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తి కంటే ముఖ్యమైనవి" అని స్పష్టంగా సమాధానం ఇచ్చారు. మ్యాచ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. "ఈ విజయాన్ని మేము పుల్గామ్ దాడిలో మరణించిన వారికి, మన సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నాం" అని చెప్పారు. ఈ నిర్ణయం తనది ఒక్కడిదే కాదని ప్రభుత్వం, బీసీసీఐ కూడా దీనికి మద్దతు ఇచ్చాయని సూర్యకుమార్ తెలిపారు. "మేము కేవలం ఆడటానికి వచ్చాము. మైదానంలో మా సమాధానం ఇచ్చాము" అని ఆయన అన్నారు.