PM Kisan : పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఎప్పుడొస్తాయి? ఈసారి త్వరగా విడుదలయ్యే ఛాన్స్
ఈసారి త్వరగా విడుదలయ్యే ఛాన్స్
PM Kisan : ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద, లబ్ధిదారులు ప్రస్తుతం 21వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతలుగా వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. గతసారి 20వ విడత సొమ్ము కొంత ఆలస్యంగా (ఆగస్టులో) విడుదల కాగా, ఈసారి మాత్రం 21వ విడత డబ్బులు త్వరగా అంటే, ఈ అక్టోబర్ నెలలోనే లేదా వచ్చే నవంబర్ నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 20 విడతల డబ్బులు విడుదలయ్యాయి. ప్రస్తుతం 9 కోట్లకు పైగా రైతులు 21వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో 20వ విడత డబ్బులు సాధారణంగా విడుదల కావాల్సిన జూన్ నెలలో కాకుండా, ఆలస్యంగా ఆగస్టు నెలలో 9.8 కోట్ల మంది రైతులకు (2.4 కోట్ల మహిళా రైతులు సహా) రూ. 2,000 చొప్పున పంపిణీ అయ్యాయి.
అయితే 21వ విడత డబ్బులు ఈసారి త్వరగా అంటే ఈ అక్టోబర్ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అక్టోబర్‌లో కాకపోయినా, ఖచ్చితంగా నవంబర్ నెలలోగా 21వ విడత నిధులు విడుదల కావడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతుల వ్యవసాయ పెట్టుబడులకు సాయం చేయడం. వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, ప్రభుత్వం రైతులకు రూ. 2,000 చొప్పున సహాయ ధనాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి మొత్తం రూ. 6,000 అందుతుంది. ఈ పథకం కింద డబ్బులు ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల కాలంలో విడుదల అవుతాయి. ప్రస్తుతం ఆగస్టు-నవంబర్ కాలానికి సంబంధించిన విడతను రైతులు ఆశిస్తున్నారు.
పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ పథకంలో నమోదు చేసుకునే రైతుల పేరు మీద తప్పనిసరిగా వ్యవసాయ భూమి ఉండాలి. కొంతమంది రైతులు వ్యవసాయ భూమి కలిగి ఉన్నప్పటికీ, ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. వారిలో ఐటీఆర్ దాఖలు చేసేవారు. వైద్యులు, ఇంజనీర్లు మొదలైన వృత్తి నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రస్తుత లేదా మాజీ ప్రజా ప్రతినిధులు మొదలైనవారు ఉన్నారు. రైతులు ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం, నమోదు వివరాల కోసం pmkisan.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.