PM Kisan Sampada Yojana: రైతులకు బంపర్ ఆఫర్.. ఆ పథకానికి అదనంగా రూ.1,920 కోట్లు కేటాయించిన కేంద్రం
ఆ పథకానికి అదనంగా రూ.1,920 కోట్లు కేటాయించిన కేంద్రం;
PM Kisan Sampada Yojana:రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వాటిలో ఒకటి పీఎం కిసాన్ సంపద యోజన (PMKSY). ఈ పథకానికి ఇప్పుడు కేంద్ర కేబినెట్ అదనంగా రూ.1,920 కోట్లను మంజూరు చేసింది. ఈ అదనపు నిధులతో ఈ పథకం మరింత వేగంగా అమలు కానుంది. ఈ పథకం వల్ల రైతులు, గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పీఎం కిసాన్ సంపద యోజన అంటే ఏమిటి?
ఆహార శుద్ధి రంగంలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో పీఎం కిసాన్ సంపద యోజనను ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతుల పొలం నుంచి రిటైల్ షాపు వరకు ఆహార ఉత్పత్తుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం. దీనివల్ల రైతులు తమ పంటలకు మంచి ధర పొందగలుగుతారు. ఉత్పత్తులు వృథా కాకుండా చూసుకుని, రైతుల ఆదాయాన్ని పెంచడం ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
అదనపు నిధులు, వాటి వినియోగం
15వ ఆర్థిక సంఘం పరిధిలో కేంద్ర కేబినెట్ ఈ పథకానికి మొత్తం రూ.6,520 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. ఇందులో, తాజాగా రూ.1,920 కోట్లను అదనంగా కేటాయించారు. ఈ నిధుల్లో రూ.1,000 కోట్లను 50 మల్టీ-ప్రొడక్ట్ ఫుడ్ ఇర్రాడియేషన్ యూనిట్లు, 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఉపయోగిస్తారు. రూ.920 కోట్లను సంపద యోజన కింద ఇప్పటికే కొనసాగుతున్న ఇతర ప్రాజెక్టులకు నిధులు అందిస్తారు.
పథకం వల్ల కలిగే ప్రయోజనాలు
పీఎం కిసాన్ సంపద యోజన వల్ల కేవలం రైతులకే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభాలు ఉన్నాయి. రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందడం, పంట వృథా కాకుండా చూసుకోగలుగుతారు. ఈ పథకం కింద కొత్తగా ఆహార శుద్ధి యూనిట్లు రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల 7 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇప్పటివరకు 1,601 ప్రాజెక్టులను ఆమోదించగా, అందులో 1,133 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 255.66 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారాన్ని శుద్ధి చేయగల సామర్థ్యం ఏర్పడింది. శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు లాభం చేకూరనుంది. అలాగే రూ.21,803.19 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.