PPF Withdrawal: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రాచుర్యం పొందిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. చాలామంది ఇందులో భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు దాచుకుంటారు. అయితే ఈ పథకం మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కావడంతో, చాలా మందికి ఈ పీపీఎఫ్‎ డబ్బులు అంతకుముందు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని ఒక అపోహ ఉంటుంది. కానీ అత్యవసర ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మెచ్యూరిటీకి ముందే పాక్షికంగా డబ్బులను వెనక్కి తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

ఎప్పటి నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు?

పీపీఎఫ్‎ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని డబ్బులు డ్రా చేసుకునే ప్రక్రియ ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం మీరు ఖాతా తెరిచిన సంవత్సరం తర్వాత కనీసం ఐదు ఆర్థిక సంవత్సరాలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‎ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే, మీరు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి మీ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులువుతారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఇలా డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఖాతా నుంచి ఎంత డబ్బు తీసుకోవచ్చనేదానికి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన లెక్కలను నిర్ణయించింది. దీనికోసం రెండు రకాల బ్యాలెన్స్‌లను పరిశీలిస్తారు. మొదటిది గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మీ ఖాతాలో ఉన్న మొత్తం, రెండవది మీరు డబ్బులు డ్రా చేస్తున్న సంవత్సరానికి నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న బ్యాలెన్స్. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉందో, ఆ మొత్తంలో గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ గత ఏడాది ఎండ్‌లో రూ.8 లక్షలు ఉండి, నాలుగు సంవత్సరాల క్రితం రూ.6 లక్షలు ఉంటే, అందులో సగం అంటే గరిష్టంగా రూ.3 లక్షలు మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది.

అకౌంట్ క్లోజింగ్, ఇతర ముఖ్యమైన నిబంధనలు

సాధారణ పరిస్థితులలో 15 సంవత్సరాలు నిండే వరకు పూర్తి డబ్బులను వెనక్కి తీసుకోలేము. కానీ కుటుంబంలో ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తినా, పిల్లల ఉన్నత చదువుల అవసరాల కోసం ఐదేళ్లు పూర్તయిన తర్వాత ఖాతాను ముందుగానే మూసివేసే వెసులుబాటు ఉంది. అలాగే ఖాతాదారుడు ఎన్ఆర్ఐగా మారితే కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే, నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు మెచ్యూరిటీ కాలంతో సంబంధం లేకుండా పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ నిబంధనలన్నింటినీ సరిగ్గా తెలుసుకోవడం ద్వారా అవసరమైనప్పుడు పీపీఎఫ్‎ మనీని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు.

Tags: