Former Google CEO: వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తే పోటీతత్వం దెబ్బతింటుంది: గూగుల్‌ మాజీ సీఈఓ

అధిక ప్రాధాన్యత ఇస్తే పోటీతత్వం దెబ్బతింటుంది: గూగుల్‌ మాజీ సీఈఓ

Update: 2025-09-26 11:39 GMT

Former Google CEO: వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై గూగుల్‌ మాజీ సీఈఓ ఎరిక్‌ ష్మిట్‌ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పోటీ సామర్థ్యం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు.

‘‘సాంకేతిక రంగంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాల్లో రాజీపడాలి. పని-జీవిత సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పోటీతత్వం దెబ్బతింటుంది. ఇంటి నుంచి పని చేయడం వల్ల నేర్చుకునే అవకాశాలు తగ్గుతాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల మార్గదర్శకత్వం లోపిస్తుంది. ఆవిష్కరణలపై ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని ఎరిక్‌ ఒక పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

అమెరికా సాంకేతిక రంగం చైనా నుంచి తీవ్ర సవాలు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. చైనాలోని అనేక సంస్థలు ‘996’ పని సంస్కృతిని అనుసరిస్తున్నాయి. దీని ప్రకారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి ఆరు రోజులు ఉద్యోగులు పని చేస్తారు. అధిక పని గంటలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ ఈ విధానం కొనసాగుతోందని వివరించారు. దీంతో అమెరికా వ్యాపారాలు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గతంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి వల్లే గూగుల్‌ ఏఐ విషయంలో వెనుకబడిందని ఆయన విమర్శలు చేశారు. కరోనా సమయంలో టెక్‌ సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను అనుసరించాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు ఆఫీసుకు రావాలని ఆదేశిస్తుండగా, మరికొన్ని హైబ్రిడ్‌ మోడల్‌ను అవలంబిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News