Vladimir Putin Net Worth : రష్యా అధ్యక్షుడి సంపద ఎంతో తెలుసా ? టాయిలెట్ బ్రష్ ధర కూడా లక్షల్లోనే
టాయిలెట్ బ్రష్ ధర కూడా లక్షల్లోనే
Vladimir Putin Net Worth : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు (డిసెంబర్ 4) భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటనలో అనేక వ్యాపార, దౌత్యపరమైన ఒప్పందాలు జరగనున్నాయి. ఈ చర్చల మధ్య ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న మరో అంశం పుతిన్ సంపద ఎంత? ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు బహిరంగంగా చెప్పుకునే పుతిన్ అసలు జీవితం ఒక రహస్యం. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నాయకులలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన జీవనశైలి పెద్ద పెద్ద రాజులు, మహారాజులను కూడా మించిపోతుందని చెబుతారు.
పుతిన్ ప్రకటించిన అధికారిక లెక్కలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మీడియా రిపోర్టులు మాత్రం వేరే కథనాన్ని చెబుతున్నాయి. ది వీక్ నివేదిక ప్రకారం, 73 ఏళ్ల పుతిన్ వార్షిక ఆదాయం కేవలం $1,40,000 (సుమారు రూ.1.26 కోట్లు) మాత్రమే. ఆయన ప్రకటించిన ఆస్తుల జాబితాలో ఒక చిన్న 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, ఒక ట్రైలర్, మూడు కార్లు మాత్రమే ఉన్నాయి.
అయితే రష్యాలో ప్రముఖ పెట్టుబడిదారుగా ఉన్న బిల్ బ్రౌడర్ వంటి ఆర్థిక నిపుణులు పుతిన్ అసలు నికర విలువ $200 బిలియన్లు (సుమారు రూ.18 వేల కోట్లు) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2003లో రష్యా బిలియనీర్ మిఖాయిల్ ఖోడోర్కోవ్స్కీని జైలుకు పంపిన తర్వాతే పుతిన్ ఈ భారీ సంపదను పోగు చేయడం మొదలుపెట్టారని బ్రౌడర్ ఆరోపిస్తున్నారు. పుతిన్ తన ఆస్తులను చాలా తెలివిగా దాచిపెట్టారని కూడా ఆయన చెబుతున్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. పుతిన్ తన పేరిట దాదాపు 20 విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారని, వీటి మొత్తం విలువ $1.4 బిలియన్లుగా అంచనా వేయబడింది. వీటిలో అత్యంత ముఖ్యమైనది నల్ల సముద్రం ఒడ్డున ఉన్న 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భారీ ప్యాలెస్. వ్యంగ్యంగా దీనిని పుతిన్ గ్రామీణ కాటేజ్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ సీలింగ్‌పై విలువైన పెయింటింగ్స్, గోడలపై గ్రీకు దేవతల విగ్రహాలు ఉన్నాయి.
ఈ ప్యాలెస్‌లోని బాత్‌రూంలో ఉపయోగించే టాయిలెట్ బ్రష్ ధర $850 (సుమారు రూ.76 వేలు), టాయిలెట్ పేపర్ హోల్డర్ ధర రూ.1.13 లక్షలు ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ ప్యాలెస్ నిర్వహణకు రోజుకు 40 మంది ఉద్యోగుల బృందం పనిచేస్తుంది, దీనికి ఏటా $2 మిలియన్లు ఖర్చు అవుతుంది. అయితే, ఈ వివరాలన్నీ మీడియా నివేదికల ఆధారంగా వచ్చినవే, దీనికి అధికారిక ధృవీకరణ లేదు. పుతిన్ విలాసవంతమైన అలవాట్లు భూమికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయనకు విమానాలు, రైళ్లు అంటే కూడా చాలా ఇష్టం.
మీడియా నివేదికల ప్రకారం పుతిన్ వద్ద 58 విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రత్యేకమైనది ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ అని పిలవబడే $716 మిలియన్ల విమానం. దీనిలో దాదాపు రూ.67 లక్షల విలువైన బంగారు టాయిలెట్ ఉందని చెబుతారు. దీనితో పాటు పుతిన్ వద్ద 22 కోచ్‌లు ఉన్న ఘోస్ట్ ట్రైన్ అనే రైలు ఉంది. ఇది కదులుతున్న కోటలా ఉంటుంది. ఈ రైలు పూర్తిగా కవచంతో కప్పబడి ఉంటుంది. తలుపులు, కిటికీలు బుల్లెట్‌ప్రూఫ్‌గా ఉంటాయి. ఇందులో విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, మూవీ థియేటర్, జిమ్, యాంటీ ఏజింగ్ మెషీన్‌లతో మసాజ్ పార్లర్ కూడా ఉన్నాయి. ఈ లైఫ్-సేవింగ్ ఎక్విప్‌మెంట్ ఉన్న రైలు నిర్మాణానికి దాదాపు $74 మిలియన్లు ఖర్చు చేశారు.