Train Fare Hike : సామాన్యుడికి షాక్.. నేటి నుంచి భారీగా పెరగనున్న రైలు టికెట్ ధరలు

నేటి నుంచి భారీగా పెరగనున్న రైలు టికెట్ ధరలు

Update: 2025-12-26 11:27 GMT

Train Fare Hike : సామాన్యుడికి రైల్వే శాఖ షాకిచ్చింది. నేటి (శుక్రవారం, డిసెంబర్ 26) నుంచి రైలు ప్రయాణం మరింత ప్రియం కానుంది. పెంచిన రైలు ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత జూలైలో ఒకసారి ఛార్జీలు పెంచిన రైల్వే, ఏడాది గడవక ముందే రెండోసారి వడ్డన మొదలుపెట్టింది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ బుక్ చేసుకునే ముందు ఏయే కేటగిరీల్లో ఎంత ధర పెరిగిందో ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకోండి.

రైల్వే శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సాధారణ తరగతి టికెట్లపై కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచారు. ఇక మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని నాన్-ఏసీ క్లాస్‌లు, అన్ని రైళ్లలోని ఏసీ క్లాస్‌ల టికెట్లపై కిలోమీటర్కు రెండు పైసల చొప్పున అదనపు భారం పడనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సదుపాయాలు పెంచడానికి, రైల్వే నిర్వహణ ఖర్చుల మధ్య సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ సమర్థించుకుంది. అయితే సబర్బన్ రైళ్లు, సీజన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం రోజువారీ ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చే అంశం.

దూరాన్ని బట్టి పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

215 కి.మీ వరకు: ఎలాంటి పెంపు లేదు.

216 నుంచి 750 కి.మీ వరకు: రూ. 5 పెరిగింది.

751 నుంచి 1250 కి.మీ వరకు: రూ. 10 పెరిగింది.

1251 నుంచి 1750 కి.మీ వరకు: రూ. 15 పెరిగింది.

1751 నుంచి 2250 కి.మీ వరకు: రూ. 20 పెరిగింది.

ఈ పెంపు కేవలం సాధారణ రైళ్లకే పరిమితం కాలేదు. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హమ్ సఫర్, అమృత్ భారత్, గరీబ్ రథ్ వంటి ప్రీమియం రైళ్లలో కూడా క్లాసులను బట్టి ఈ ధరల పెంపు వర్తిస్తుంది. అయితే రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ ఫాస్ట్ ఛార్జీలు, జీఎస్టీలో ఎలాంటి మార్పులు లేవు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ పెరిగిన ధరలు ఈరోజు (డిసెంబర్ 26) లేదా ఆ తర్వాత బుక్ చేసే టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఒకవేళ మీరు ఈరోజు కంటే ముందే టికెట్ బుక్ చేసుకుని ఉంటే, మీ ప్రయాణం రేపు లేదా ఆ తర్వాత ఉన్నా కూడా మీరు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News