Raksha Bandhan 2025: చైనా రాఖీలకు బైబై.. ఈ సారి దేశవ్యాప్తంగా రూ.17000కోట్ల వ్యాపారం
ఈ సారి దేశవ్యాప్తంగా రూ.17000కోట్ల వ్యాపారం;
Raksha Bandhan 2025: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీపండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశంలోని మార్కెట్లు సందడిగా మారాయి. ఈసారి రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.17,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ పండుగ విశేషాలు, మార్కెట్ ట్రెండ్స్, ఈసారి రాఖీల ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
పండుగకు కావాల్సిన వస్తువుల కొనుగోలుతో దేశవ్యాప్తంగా మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఒక అంచనా వేసింది. ఈసారి రాఖీ పండుగ సందర్భంగా దేశంలో దాదాపు రూ.17,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపింది. ఇందులో మిఠాయిలు, పండ్లు, బహుమతులపైనే రూ.4,000 కోట్ల ఖర్చు ఉంటుందని అంచనా వేసింది.
ఈసారి రాఖీ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, మార్కెట్‌లో చైనా రాఖీలు లేదా వస్తువులు కనిపించడం లేదు. ఈసారి పండుగ కేవలం అన్నచెల్లెళ్ల బంధాన్ని మాత్రమే కాకుండా, దేశభక్తి, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని కూడా చాటుతోంది. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం కూడా కావడంతో ఈసారి రాఖీ పండుగకు ఒక ప్రత్యేకమైన దేశభక్తి భావన జోడైంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “ఈసారి రాఖీలు దేశభక్తి, అన్నచెల్లెళ్ల ప్రేమ రెండింటికీ ప్రతీకగా నిలుస్తాయి. సైనికులకు అంకితం చేసిన రాఖీల డిమాండ్ బాగా పెరిగింది. దేశవ్యాప్తంగా సైనికులకు రాఖీ కట్టి వారిని గౌరవిస్తున్నారు" అని అన్నారు.
ఈసారి మార్కెట్‌లో రకరకాల కొత్త రాఖీలు అందుబాటులో ఉన్నాయి. దేశభక్తికి సంబంధించి వోకల్ ఫర్ లోకల్, డిజిటల్ రాఖీ, మోడీ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీ , జై హింద్ రాఖీ, వందేమాతరం రాఖీ వంటివి బాగా అమ్ముడవుతున్నాయి. పర్యావరణ స్పృహ పెరగడంతో, మట్టి, విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తి వంటి సహజ వస్తువులతో తయారు చేసిన రాఖీలకు కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ రాఖీల వల్ల స్థానిక మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలు, చేతివృత్తుల వారికి కూడా మంచి ఆదాయం లభిస్తోంది. ఇది మహిళా సాధికారతకు, స్థానిక పరిశ్రమల అభివృద్ధికి ఒక మంచి మార్గమని ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.