Indian Rupee : డాలర్‌తో పోలిస్తే రూపాయికి హ్యాట్రిక్ బలం..రికార్డ్ పతనం నుంచి ఫాస్ట్ రికవరీ
రికార్డ్ పతనం నుంచి ఫాస్ట్ రికవరీ
Indian Rupee : గత మూడు రోజులుగా కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి బలం పుంజుకుంది. ఇటీవల రికార్డు స్థాయి పతనాన్ని (రూ.91) నమోదు చేసిన రూపాయి, ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.89 స్థాయికి చేరుకుంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 24 పైసలు బలపడి రూ.89.96 వద్ద ట్రేడ్ అయింది, ఇది రికార్డ్ కనిష్ట స్థాయి నుంచి దాదాపు 1.25 శాతం మెరుగుదల. ఈ అనూహ్య పెరుగుదలకు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడం, కార్పొరేట్ సంస్థల నుంచి డాలర్ల రాక పెరగడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $60 దిగువకు పడిపోవడం దోహదపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా గురువారం రూ.595.78 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం రూపాయికి మద్దతునిచ్చింది.
రూపాయి రూ.90.22 వద్ద ప్రారంభమై, ఆర్బీఐ జోక్యం కారణంగా బలపడి రూ.89.96 వద్దకు చేరింది. అయితే రూపాయికి సంబంధించిన సంక్షోభం పూర్తిగా తొలగిపోలేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేకపోవడం, అమెరికన్ టారిఫ్‌ల భారం ఇప్పటికీ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫినరెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంతమంది ఊహాజనిత కొనుగోలుదారులు మార్కెట్ నుంచి నిష్క్రమించడం వల్ల డాలర్ కొనుగోలు తగ్గింది. రానున్న రోజుల్లో రూపాయి రూ.90-90.50 పరిధిలోనే హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈలోగా ప్రపంచ చమురు మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర $59.66 వద్ద, డాలర్ ఇండెక్స్ 98.46 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా పెరుగుదలను నమోదు చేశాయి.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సభ్యుడు సంజీవ్ సన్యాల్ రూపాయి ప్రస్తుత బలహీనతపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. రూపాయి విలువ పతనం గురించి తాను అస్సలు ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. చైనా, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలు కూడా తమ అధిక వృద్ధి దశలలో కరెన్సీ బలహీనతను చవిచూశాయని ఆయన గుర్తు చేశారు. రూపాయిని ఎక్కువగా మార్కెట్ శక్తులకు వదిలివేసినప్పటికీ, అధిక అస్థిరతను నియంత్రించడానికి మాత్రమే ఆర్‌బీఐ తన నిల్వలను ఉపయోగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల రూపాయి ప్రస్తుత బలహీనతను ఆర్థిక ఆందోళనగా పరిగణించాల్సిన అవసరం లేదని సన్యాల్ పేర్కొన్నారు.