RBI : షేర్ల కొనుగోలుకు అప్పు కావాలా? ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే
ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. షేర్లు, ఐపీఓలు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులపై కొత్త పరిమితులను విధించింది. ముఖ్యంగా ఒక వ్యక్తి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఎంత రుణం తీసుకోవచ్చనే దానిపై స్పష్టతనిచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. షేర్లు లేదా ఇతర సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ పరిమితిని ఆర్బీఐ ఒక కోటి రూపాయలుగా నిర్ణయించింది. ఇది కేవలం ఒక బ్యాంకుకు మాత్రమే కాదు, మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపి వర్తిస్తుంది. ఇక ఐపీఓ, ఫాలో-ఆన్ ఆఫర్ లేదా ఈసాప్ ల ద్వారా షేర్లు కొనుగోలు చేసేందుకు ఇచ్చే రుణ పరిమితిని గతంలో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. స్వల్పకాలిక లాభాల కోసం అధిక మొత్తంలో అప్పులు తీసుకుని మార్కెట్లోకి రావడాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
జూలై 1 నుంచే కొత్త నిబంధనలు
నిజానికి ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమలు కావాల్సి ఉంది. అయితే, బ్యాంకులు, పరిశ్రమ వర్గాల విన్నపం మేరకు ఆర్బీఐ ఈ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. ఇప్పుడు ఈ నిబంధనలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను అప్‌డేట్ చేసుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఈ అదనపు సమయం ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మార్కెట్ రిస్క్ తగ్గించే ప్రయత్నం
షేర్ల మీద లేదా ఐపీఓల కోసం భారీగా అప్పులు తీసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకే వ్యక్తి వివిధ బ్యాంకుల నుంచి ఎక్కువ రుణం తీసుకోకుండా ఈ సిస్టమ్ వైడ్ లిమిట్ అడ్డుకుంటుంది. దీనివల్ల బ్యాంకుల రిస్క్ తగ్గుతుంది. అలాగే ఏదైనా కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇచ్చే రుణాల విషయంలో కూడా ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. అటువంటి రుణాలకు ప్రధాన కంపెనీ నుండి గ్యారెంటీ తీసుకోవడం తప్పనిసరి చేసింది.
కంపెనీల కొనుగోలుపై స్పష్టత
కంపెనీల విలీనాలు, స్వాధీనాల విషయంలో కూడా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది. ఏదైనా నాన్-ఫైనాన్షియల్ కంపెనీపై నియంత్రణ సాధించే క్రమంలో మాత్రమే బ్యాంకులు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య సమతుల్యతను కాపాడుతూ, పెట్టుబడులు మరింత పారదర్శకంగా, సురక్షితంగా సాగడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.