TGRERA : రెండు నిర్మాణ సంస్ధలపై కొరడా ఝుళిపించిన రెరా
నిర్మాణల్లో లోపాలపై భారీ జరిమానా విధించిన తెలంగాణ రెరా;
నిర్మాణ లోపాలతో పాటు ప్రాజెక్టు వివరాలను రెరాలో నమోదు చేయకపోవడంపై కొనుగోలుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు నిర్మాణ స్ధంస్ధలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ భారీ జరిమానాలు విధించింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం 2016 ప్రకారం తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు హైదరాబాద్‌కు చెందిన హరిస్ ప్రణవ్, విజిలింగ్ మెడోస్ డెవలపర్స్ అనే రెండు నిర్మాణ సంస్ధలకు రెరా జరిమానాలు విధించింది. మాదాపూర్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న హరీస్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ సంస్ధ మియాపూర్ లో నిర్మిస్తున్న ప్రణవ్ ఎలైట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో అవకతవకలకు గాను రూ.7.68 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా ఈ ప్రణవ్ ఎలైట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో తక్షణం నీటి పారుదల సమస్యలను పరిష్కరించాలని టీజీరెరా ఆదేశించింది. కొనుగోలు దారులకు ఎటువంటి ఖర్చు లేకుండా మరమ్మతులు నిర్వహించి, 30 రోజుల్లోపు పనిని పూర్తి చేయాలని బిల్డర్‌ను రెరా ఆదేశించింది. ప్రణవ ఎలైట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి బాబా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు రెరా ఈ జరిమానా విధించింది. ఆమోదించబడిన భవన ప్రణాళికల ప్రకారం సెక్యూరిటీ/వాచ్‌మెన్ గదిని నిర్మించకపోవడం, ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మరియు జనరేటర్ బ్యాకప్ లేకపోవడం, పార్కింగ్ ఏర్పాట్లు సరిపోకపోవడం, నాణ్యత లేని నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వంటి అనేక ఉల్లంఘనలను ఈ ప్రాజెక్టు నిర్మణంలో హరిస్ ప్రణవ్ సంస్ధపై ఎత్తిచూపారు.
ఇక రెండో కేసులో విజిలింగ్ మెడోస్ డెవలపర్‌కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూ.21.08 లక్షల జరిమానా విధించింది. తమ ప్రాజెక్ట్ విజిలింగ్ మెడోస్‌ను TGRERAతో నమోదు చేయడంలో విఫలమైనందుకు ముగ్గురు డెవలపర్లైప నిజాంపేటకు చెందిన కాప్‌స్టోన్ ప్రాపర్టీస్, రంగారెడ్డి జిల్లా ఉదిత్యాల్‌కి చెందిన బీఎన్‌ఆర్ టౌన్‌షిప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన బొల్లా శ్రీనివాస్ రావులపై టీజీరెరా రూ. 21.08 లక్షల సమిష్టి జరిమానా విధించింది. అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినప్పటికీ, ముందస్తు మొత్తాలను చెల్లించినప్పటికీ, డెవలపర్లు వాగ్దానం చేసినట్లుగా ప్లాట్‌లను కేటాయించలేదని ఫిర్యాదుదారులు సుంచు సంతోష్ బాబు, సుంకర కిరణ్ కుమార్‌లు అథారిటీని ఆశ్రయించారు. వారు వరుసగా రూ.10 లక్షలు మరియు రూ.12.80 లక్షల వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఎస్‌బిఐ ఎంసిఎల్‌ఆర్ రేటు ప్రకారం 9 శాతం వడ్డీతో పాటు అదనంగా 2 శాతం వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు.