RBI : బ్యాంకుల్లో ఎవరిదీ కాని డబ్బులు రూ.67,000కోట్లున్నాయట.. మీవి ఏమైనా ఉన్నాయా
మీవి ఏమైనా ఉన్నాయా;
RBI : మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా? అందులో ఎప్పుడో డబ్బులు వేసి మర్చిపోయారా.. అలా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డబ్బు భారీగా పేరుకుపోయింది. రకరకాల కారణాల వల్ల ఖాతాదారులు ఈ డబ్బును తీసుకోకుండా వదిలేశారు. ఇలా క్లెయిమ్ చేయకుండా ఉన్న దాదాపు 67,000 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌కు తెలియజేసింది. జూన్ 30 నాటికి, భారతీయ బ్యాంకులు ఈ మొత్తాన్ని DEA ఫండ్‌కు పంపించాయి.
ఈ క్లెయిమ్ చేయని డబ్బులో సింహభాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే వచ్చిందట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఏకంగా 19,329 కోట్ల రూపాయలను DEA ఫండ్‌కు బదిలీ చేసింది. ఎస్బీఐతో పాటు ఇతర ప్రభుత్వ బ్యాంకుల నుంచి మొత్తం 58,330 కోట్ల రూపాయలు ఈ ఫండ్‌లోకి చేరాయి. అంటే, బదిలీ అయిన డబ్బులో ఎక్కువ భాగం ప్రభుత్వ బ్యాంకుల నుంచే వచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఏ బ్యాంకు ఖాతాలోనైనా పది సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిద్రాణంగా ఉండిపోయిన డిపాజిట్లను క్లెయిమ్ చేయని డబ్బు గా పరిగణిస్తారు. ఇందులో వివిధ రకాల డిపాజిట్లు ఉంటాయి. అవి ఆర్డీ, ఎఫ్‌డీ, సేవింగ్స్ డిపాజిట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్ , లోన్ అకౌంట్ వంటివి ఇందులో ఉంటాయి.
డిఇఎ (DEA) అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన డబ్బును నిజమైన ఖాతాదారులకు, లేదా వారి నామినీలకు, లేదంటే చట్టబద్ధమైన వారసులకు చేరేలా చూడటమే ఆర్‌బీఐ లక్ష్యం. ఇందుకోసం ఒక కేంద్రకృత ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆర్‌బీఐ, ఈ DEA అనే ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అన్ని బ్యాంకుల నుంచి క్లెయిమ్ చేయని డబ్బును ఈ ఫండ్‌కు బదిలీ చేస్తారు.
ఆర్‌బీఐ DEA ఫండ్‌లో ఉన్న డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఖాతాదారులు లేదా వారి నామినీలు, లేదా చట్టబద్ధమైన వారసులు తమ డబ్బును ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వారు తమకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు వెంటనే ఖాతాను సెటిల్ చేసి, డబ్బును చెల్లిస్తుంది. డబ్బు చెల్లించిన తర్వాత, బ్యాంకులు ఆర్‌బీఐ DEA ఫండ్ నుంచి ఆ మొత్తాన్ని తిరిగి క్లెయిమ్ చేసుకుంటాయి. కాబట్టి, మీ డబ్బు సురక్షితంగానే ఉంటుంది. మీరు సరైన పత్రాలతో బ్యాంకును సంప్రదించి, మీ డబ్బును తిరిగి పొందవచ్చు.
నోట్ : మీ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు లేకపోతే, అది నిద్రాణంగా మారిపోకుండా ఎప్పటికప్పుడు చిన్న లావాదేవీలైనా చేయండి. మీ బ్యాంకు ఖాతా వివరాలను, నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.