Indian Rupee : ఆర్‌బీఐ పవర్ పని చేయడం లేదా? డాలర్ కొట్టిన దెబ్బకు రూపాయికి దిమ్మతిరిగిపోయింది

డాలర్ కొట్టిన దెబ్బకు రూపాయికి దిమ్మతిరిగిపోయింది

Update: 2025-12-26 11:31 GMT

 Indian Rupee : క్రిస్మస్ సెలవుల తర్వాత భారత కరెన్సీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ప్రారంభం కావడమే భారీ పతనంతో మొదలైంది. ఒకవైపు ఆర్‌బీఐ తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, డాలర్ ముందు రూపాయి నిలవలేక చతికిలపడింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి చేరువలో ఉంది. ఇప్పుడు అందరి కళ్లు ఆ 90 మార్కు మీదనే ఉన్నాయి. రూపాయి విలువ గనుక డాలర్‌తో పోలిస్తే 90 దాటితే, అది భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

శుక్రవారం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 23 పైసలు తగ్గి 89.94 వద్ద నిలిచింది. నిజానికి బుధవారం నాడు రూపాయి 89.71 వద్ద ముగిసింది, కానీ వరుసగా రెండో రోజు కూడా తన బలహీనతను చాటుకుంది. క్రిస్మస్ సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు ఉండటంతో, శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడటం, అమెరికాతో జరగాల్సిన ట్రేడ్ డీల్‌లో జాప్యం కలగడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి.

రూపాయి ఎందుకు పడిపోతోంది? ప్రధాన కారణాలు ఇవే

చమురు సెగ: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.16 శాతం పెరిగి 62.34 డాలర్లకు చేరింది. భారత్ తన అవసరాల కోసం చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ధరలు పెరిగితే మనం ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది.

పెట్టుబడుల ఉపసంహరణ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు డిసెంబర్ నెలలోనే ఏకంగా రూ. 13,177 కోట్లను మన షేర్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. కేవలం బుధవారం ఒక్క రోజే రూ. 1,721 కోట్లు బయటకు వెళ్లాయి.

డాలర్ ఇండెక్స్ ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతుండటంతో రూపాయి వంటి వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. నెల చివరలో కంపెనీలు తమ చెల్లింపుల కోసం డాలర్లను భారీగా కొనుగోలు చేయడం కూడా ఒక కారణం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రూపాయి త్వరలోనే 90 మార్కును తాకే అవకాశం ఉంది. ఒకవేళ రూపాయి విలువ ఇలాగే పడిపోతే, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు (ఎలక్ట్రానిక్స్, ముడి చమురు, వంట నూనెలు) భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఆర్‌బీఐ రంగంలోకి దిగి డాలర్లను విక్రయిస్తే తప్ప రూపాయికి ప్రస్తుతానికి ఊరట లభించేలా లేదు. మరోవైపు సెన్సెక్స్, నిఫ్టీలు కూడా నష్టాల్లో కొనసాగుతుండటం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.

Tags:    

Similar News