SBI : ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. నవంబర్ 30 నుంచి ఆ సర్వీస్ బంద్
నవంబర్ 30 నుంచి ఆ సర్వీస్ బంద్
SBI : భారతీయ స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ 30, 2025 తర్వాత OnlineSBI, YONO Lite యాప్‌లలో mCash ద్వారా డబ్బు పంపే, క్లెయిమ్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇకపై లబ్ధిదారుని నమోదు చేయకుండా కేవలం మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు పంపేందుకు mCashను ఉపయోగించడానికి వీలుండదు.
ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన మెసేజ్ ప్రకారం..ఆన్‌లైన్ఎస్‌బీఐ, యోనో లైట్ ప్లాట్‌ఫారమ్‌లలో mCash సదుపాయం నవంబర్ 30 తర్వాత అందుబాటులో ఉండదు. mCash సేవ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న ఏ ఎస్‌బీఐ కస్టమర్ అయినా, లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయకుండా, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బును పంపేవారు. లబ్ధిదారులు (ఏ బ్యాంకు ఖాతా ఉన్నవారైనా) mCash లింక్ లేదా యాప్ ద్వారా పంపిన 8-అంకెల పాస్‌కోడ్‌ను ఉపయోగించి ఆ డబ్బును తమ ఖాతాకు క్లెయిమ్ చేసుకునేవారు.ఈ సేవ నిలిపివేయడం వలన ఇకపై ఈ పద్ధతిలో డబ్బు పంపడం లేదా క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు.
థర్డ్ పార్టీ లబ్ధిదారులకు సురక్షితంగా, వేగంగా డబ్బు బదిలీ చేయడానికి ఇక మీదట యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్‌టీజీఎస్ వంటి డిజిటల్ పేమెంట్ మార్గాలను ఉపయోగించాలని ఎస్‌బీఐ కస్టమర్లకు సూచించింది.
UPI ద్వారా డబ్బు ఎలా పంపాలి?
mCash స్థానంలో ప్రస్తుతం అత్యంత సురక్షితమైన, సులభమైన మార్గం యూపీఐ.ఎస్‌బీఐ యూపీఐ యాప్ అయిన BHIM SBI Pay ను ఉపయోగించి కింది విధంగా డబ్బు పంపవచ్చు. ముందుగా BHIM SBI Pay యాప్‌లోకి లాగిన్ అవ్వండి. పే ఆప్షన్ ఎంచుకోండి. VPA, లేదా ఖాతా/IFSC, లేదా QR కోడ్ వంటి ఏదైనా చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోండి. అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి. డబ్బు డెబిట్ చేయాల్సిన ఖాతాను ఎంచుకుని టిక్ గుర్తుపై క్లిక్ చేయండి. లావాదేవీని ఆమోదించడానికి మీ యూపీఐ పిన్ నమోదు చేసి, చెల్లింపును పూర్తి చేయడానికి టిక్ గుర్తుపై క్లిక్ చేయండి.