Share Market : స్టాక్ మార్కెట్ అదిరే జంప్..ఇన్వెస్టర్ల జేబుల్లోకి చేరిన రూ.3 లక్షల కోట్లు

ఇన్వెస్టర్ల జేబుల్లోకి చేరిన రూ.3 లక్షల కోట్లు

Update: 2026-01-28 13:34 GMT

Share Market : భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ బుధవారం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఉదయం మార్కెట్ ప్రారంభం కావడమే భారీ లాభాలతో మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‎లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం విలువ ఇప్పుడు రూ.456 లక్షల కోట్లకు చేరుకుంది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందమే ఈ జోరుకు ప్రధాన కారణం. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, అమెరికాపై ఉన్న ఆధారపడటం తగ్గుతుందనే ఆశలు ఇన్వెస్టర్లలో పెరిగాయి.

మార్కెట్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది భారత్-ఈయూ మధ్య కుదిరిన సుంకాల తగ్గింపు ఒప్పందం. దీనివల్ల భారతీయ వస్తువులకు ఐరోపా మార్కెట్లలో గట్టి ఆదరణ లభించనుంది. రెండోది, రూపాయి విలువ బలపడటం. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 91.57 వద్దకు చేరింది. ఇది విదేశీ ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతాలను పంపింది, ఫలితంగా వారు భారతీయ షేర్లను కొనేందుకు ఎగబడ్డారు.

మరో కీలక అంశం ఏమిటంటే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ నాలుగు ఏళ్ల కనిష్టానికి పడిపోవడం. గత వారమే 2 శాతం పడిపోయిన డాలర్, ఈ వారం మరో 1.5 శాతం నష్టపోయింది. డాలర్ బలహీనపడటం ఎప్పుడూ భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లకు లాభదాయకమే. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు పెరగడమే కాకుండా, దిగుమతి ఖర్చులు కూడా తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు డాలర్ కంటే ఈక్విటీల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

చివరగా గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం కూడా మనకు కలిసొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పాత హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గడం మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న బెదిరింపులను ఆయన పక్కన పెట్టారు. దక్షిణ కొరియా వంటి దేశాలతో కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని ఆయన ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ భయాలు తొలగిపోయాయి. ఈ సానుకూల పవనాలన్నీ కలిసి భారత మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి.

Tags:    

Similar News