Silver Price : రూ. 2 లక్షలు వెండి ధర..20 ఏళ్లలో భారీగా పెరుగుదల..రికార్డు హైకి కారణాలేంటి?
20 ఏళ్లలో భారీగా పెరుగుదల..రికార్డు హైకి కారణాలేంటి?
Silver Price : గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నా వెండి మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 12, శుక్రవారం రోజున ఎంసీఎక్స్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, ఆ తర్వాత పెట్టుబడిదారులు లాభాలు స్వీకరించడం వల్ల స్వల్పంగా తగ్గింది. అయితే, వెండి ధర మాత్రం అదే ఊపును కొనసాగించి సరికొత్త శిఖరాలను చేరుకుంది.
శుక్రవారం ఎంసీఎక్స్ గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 0.10 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,32,599 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో మార్చి డెలివరీ కోసం ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్ ట్రేడ్ 0.50 శాతం తగ్గి కిలోగ్రాముకు రూ. 1,97,951 వద్ద ఉంది.
అయితే అంతకుముందు గురువారం నాడు వెండిలో భారీ పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.1,98,814 వద్ద ఆల్-టైమ్ హై స్థాయికి చేరుకుంది. దీని క్లోజింగ్ 5.33 శాతం లాభంతో రూ. 1,98,799 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ కూడా 2 శాతం ఎగబాకి 10 గ్రాములకు రూ. 1,32,469 వద్ద ముగిసింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ, వచ్చే ఏడాది కూడా కోతలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో బంగారం, వెండి ధరల్లో ఈ బలం కనిపిస్తోంది.
ప్రస్తుతం వెండి ధర కిలోగ్రాముకు రూ.2లక్షల మార్కును దాటింది. 17 నవంబర్ 2005న ఎంసీఎక్స్ (MCX)లో కిలో వెండి ధర రూ. 12,000 మాత్రమే ఉండేది. సుమారు 20 ఏళ్ల ప్రయాణంలో వెండి ధర రూ.2 లక్షల మార్కును చేరుకోవడం విశేషం. శుక్రవారం దేశంలో కిలో వెండి ధర రూ.2,900 పెరిగి రూ.2,00,900 వద్ద కొత్త హై లెవల్‌కు చేరింది. అదేవిధంగా, 100 గ్రాముల వెండి ధర రూ.20,090 కాగా, 10 గ్రాముల ధర రూ.2,009గా నమోదైంది.
నేడు ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో కిలో వెండి ధర రూ. 1,97,900గా ఉంది. అయితే చెన్నైలో కిలో వెండి ధర అత్యధికంగా రూ.2,09,900గా నమోదైంది. గత వారంలో వెండి ధర దాదాపు 6 శాతం పెరిగింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, పరిశ్రమల్లో బలమైన డిమాండ్, అమెరికా కీలక ఖనిజాల జాబితాలో వెండి చేరడం, తక్కువ ఇన్వెంటరీ కారణంగా వెండిలో ఇప్పటివరకు 115 శాతం భారీ పెరుగుదల నమోదైంది.