Silver Price : ఒక్క ఏడాదిలోనే 129% లాభం..వెండి కొన్నవారికి డబుల్ బొనాంజా
వెండి కొన్నవారికి డబుల్ బొనాంజా
Silver Price : దేశీయ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. వరుసగా రెండో రోజు భారీ పెరుగుదలతో ఈ తెల్లటి లోహం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. గురువారం వెండి ధర ఏకంగా రూ.1,800 పెరిగి, కిలో రూ.2,07,600 అనే కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. దీనికి ముందు బుధవారం ఒక్కరోజే రూ.7,300 పెరగడం ద్వారా వెండి ధర తొలిసారిగా రూ.2 లక్షల మార్కును దాటింది. పెట్టుబడిదారులు, వ్యాపారుల నుంచి భారీగా కొనుగోళ్లు జరగడం వల్లే ఈ పెరుగుదల కనిపిస్తోందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వెండి ఈ సంవత్సరంలో అత్యంత వేగంగా రాబడిని అందించిన కమోడిటీగా నిలిచింది. 2025 జనవరి 1న కిలో వెండి ధర సుమారు రూ.90,500 ఉండగా, ఇప్పటివరకు రూ.1,17,000 పైగా పెరిగింది. అంటే కేవలం ఈ సంవత్సరంలోనే వెండి దాదాపు 129% రాబడిని ఇచ్చింది. వెండిలో ఈ ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ, బంగారం (99.9% స్వచ్ఛత) ధర మాత్రం గురువారం రూ.1,36,500 ప్రతి 10 గ్రాములకు వద్ద దాదాపు స్థిరంగా ఉంది. దీనిని బట్టి, ప్రస్తుతం పెట్టుబడిదారులు పసిడి కంటే వెండిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వెండి పటిష్టంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా వెండి ధర $66.88 డాలర్ల రికార్డు స్థాయిని తాకి, గురువారం కొద్దిగా తగ్గి $66.04 వద్ద నిలిచింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కూడా వెండి దాదాపు 126% పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్‌కు మించిన సరఫరా కొరత. ఎలక్ట్రానిక్స్, సోలార్ వంటి రంగాల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వరుసగా ఐదో ఏడాది కూడా వెండి సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో, ఈ ధరల ట్రెండ్ 2026 వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.