Food Delivery : ట్రైన్‌లో ఫుడ్ డెలివరీలో స్టూడెంట్లే కింగ్స్.. బిర్యానీతో పాటు సీ-ఫుడ్ కూడా
బిర్యానీతో పాటు సీ-ఫుడ్ కూడా;
Food Delivery : రైలు ప్రయాణాలు అంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ట్రైనే బెస్ట్ ఆప్షన్. అయితే, రైలులో ఫుడ్ విషయంలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటంటే, ట్రైన్‌లో ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడంలో విద్యార్థులే ముందున్నారట. తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, మే 2025లో వేసవి సెలవుల సమయంలో చాలా మంది స్టూడెంట్స్ రైళ్లలో ఇంటికి వెళ్తూ, ఫుడ్ డెలివరీ సర్వీస్‌లను తెగ వాడేశారట.
ఐఆర్‌సీటీసీ (IRCTC) ఈ-క్యాటరింగ్ సర్వీస్‌తో జతకట్టిన స్విగ్గీ ట్రైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌లో, ఆర్డర్ చేసే ప్రతి ముగ్గురు కస్టమర్లలో ఒకరు విద్యార్థే ఉన్నారట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాదాపు 20% మంది స్టూడెంట్స్ ఒకే ప్రయాణంలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఆర్డర్ చేశారట. సాధారణంగా ఒక స్టేషన్‌లో డిన్నర్ ఆర్డర్ చేసి, ఆ తర్వాత స్టేషన్‌లో డెజర్ట్ (స్వీట్) ఆర్డర్ చేసుకున్నారట.
ట్రైన్‌లో మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సీ, పిజ్జా హట్ వంటి బ్రాండ్ల ఫాస్ట్ ఫుడ్ బాగానే అమ్ముడుపోయినప్పటికీ, చాలా మంది స్టూడెంట్స్ హెల్తీ బౌల్స్, క్లౌడ్ కిచెన్స్ నుంచి వచ్చే హోమ్లీ ఫుడ్‌ను కూడా ఎంచుకున్నారట. దీనిబట్టి, విద్యార్థులు రుచికి ప్రాధాన్యత ఇస్తూనే, తమ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది.
విద్యార్థులు చేసిన మొత్తం ఆర్డర్లలో దాదాపు 70% వాటా ఇంజనీరింగ్ విద్యార్థులదే. ముఖ్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బీహెచ్‌యూ వారణాసి, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కాలేజీల విద్యార్థులు రైలులో ఎక్కువగా ఆర్డర్లు చేశారట. డబ్బులు మేనేజ్ చేసుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ బై నౌ పే లేటర్ వంటి ఆప్షన్లను కూడా వాడారు.
ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ సర్వీస్‌లో స్విగ్గీతో పాటు, జోమాటో, డొమినోస్, ఫాసోస్ వంటి మొత్తం 22 ఫుడ్ పార్ట్‌నర్స్ ఉన్నారు. వీరంతా కలిపి 300కు పైగా స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. అయితే, స్విగ్గీ యొక్క ట్రైన్ ఫుడ్ డెలివరీ ప్రస్తుతం సుమారు 100 స్టేషన్లకు మాత్రమే పరిమితం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా మంది విద్యార్థులు తమ కోసమే కాదు, మొత్తం కోచ్ కోసం బల్క్‌గా ఆర్డర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.
విద్యార్థులు కేవలం బిర్యానీ, బర్గర్లు, లేదా వెజ్/నాన్-వెజ్ థాలీలు మాత్రమే కాకుండా, పనీర్ టిక్కా క్వెసాడిల్లా, స్పగెట్టి ఎగ్లియో ఒలియో, అరేబియన్, మెడిటెరేనియన్ డిష్‌లు కూడా ఆర్డర్ చేశారట. తవా ఫ్రై, చికెన్ కషా భూనా, కింగ్ ఫిష్, ఇతర సీ-ఫుడ్ డిష్‌లకు కూడా మంచి డిమాండ్ కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి.