Maintenance Law : భర్తల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే తీర్పు..జీతం రాకముందే భార్యల ఖాతాలోకి సగం డబ్బు

జీతం రాకముందే భార్యల ఖాతాలోకి సగం డబ్బు

Update: 2026-03-06 06:50 GMT

Maintenance Law : భార్యాపిల్లల పోషణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే భర్తలకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భార్యకు విడిగా భరణం చెల్లించమంటే సాకులు చెబుతున్న ఒక వ్యక్తి విషయంలో ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ భర్త చేతికి జీతం రాకముందే, అందులో సగం వాటాను నేరుగా భార్య ఖాతాకే బదిలీ చేయాలని సదరు కంపెనీని ఆదేశించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అరుదైన ఉత్తర్వులను జారీ చేసింది.

అసలు ఏం జరిగింది?

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. సదరు దంపతులు 2022 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. భార్య తన తండ్రి మరణం తర్వాత మేనమామ ఇంట్లో ఉంటూ చిన్నారిని పెంచుతోంది. భర్త మాత్రం గత నాలుగేళ్లుగా కూతురిని చూడటానికి రాలేదు సరే కదా, కనీసం పైసా కూడా ఆర్థిక సాయం చేయలేదు. కోర్టు ఆదేశించినా ట్రావెల్ ఖర్చుల కోసం కూడా రూపాయి విదల్చలేదు. దీంతో విసిగిపోయిన భార్య న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన భర్త

నిజానికి, 2024లో మెజిస్ట్రేట్ కోర్టు ఈ వ్యక్తికి భరణం చెల్లించాలని ఆర్డర్ వేసింది. కానీ దానిని అతను అమలు చేయలేదు. సుమారు రూ.1.38 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తన జీతం కేవలం రూ.50 వేలు మాత్రమేనని, తనకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అతను వాదించాడు. బకాయిలతో కలిపి ఒకేసారి రూ.2.5 లక్షలు కడతావా? అని కోర్టు అడిగితే.. దానికి కూడా అతను నిరాకరించాడు. దీంతో కోర్టుకు చిర్రెత్తుకొచ్చింది.

సగం జీతం నేరుగా భార్య ఖాతాకే

భర్త వైఖరిని గమనించిన సుప్రీంకోర్టు.. ఇక ఇలా లాభం లేదని భావించింది. అతను పనిచేస్తున్న కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా అతని జీతం నుంచి రూ.25,000 కట్ చేసి, నేరుగా ఆర్టీజీఎస్ పద్ధతిలో భార్య ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మైనర్ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ఏప్రిల్‌లో జరగబోయే తదుపరి విచారణలో ఈ ఆదేశాల అమలును కోర్టు సమీక్షించనుంది.

Tags:    

Similar News