Tariff War : అమెరికా-చైనా మధ్య టారిఫ్ వివాదం.. ట్రంప్ నిర్ణయంతో తగ్గిన ఉద్రిక్తత
ట్రంప్ నిర్ణయంతో తగ్గిన ఉద్రిక్తత;
Tariff War : అమెరికా, చైనాల మధ్య సాగుతున్న టారిఫ్ వార్ కు సంబంధించి ఒక కీలక వార్త వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్ సస్పెన్షన్‌ను మరో 90 రోజులు పొడిగిస్తూ ఒక ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కాస్త తగ్గింది. దీనికి చైనా కూడా సానుకూలంగా స్పందించింది. మరి ఈ నిర్ణయాలతో టారిఫ్ వార్ ఇప్పుడు తగ్గుముఖం పడుతుందా? పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం, ఆగస్టు 11, 2025న చైనాపై విధించిన టారిఫ్ సస్పెన్షన్‌ను మరో 90 రోజులు పొడిగించారు. ఈ నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొంతవరకు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశానని, దీనివల్ల చైనాపై టారిఫ్ సస్పెన్షన్ మరో 90 రోజులు పొడిగించబడుతుందని తెలిపారు. మిగిలిన ఒప్పంద అంశాలు అలాగే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, చైనా ఒకరి ఉత్పత్తులపై మరొకరు భారీగా టారిఫ్‌లు విధించుకోవడం మొదలుపెట్టాయి. ఈ టారిఫ్‌లు మూడు అంకెల స్థాయికి చేరుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. మే 2025లో రెండు దేశాలు తాత్కాలికంగా టారిఫ్‌లను తగ్గించడానికి అంగీకరించాయి. గతంలో ఇచ్చిన గడువు ఆగస్టు 12, 2025న ముగియాల్సి ఉంది. ఈ గడువు పొడిగించకపోతే, అమెరికా చైనా దిగుమతులపై ఇప్పటికే ఉన్న 30శాతం టారిఫ్‌ను ఇంకా పెంచే అవకాశం ఉండేది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఎగుమతులపై తమ టారిఫ్‌లను పెంచేది. అయితే, ఇప్పుడు ఈ తాత్కాలిక ఒప్పందం పొడిగించబడింది.
అమెరికా నిర్ణయం తర్వాత చైనా నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. ట్రంప్ ప్రకటన తర్వాత, చైనా స్టేట్ మీడియా షిన్హువా న్యూస్ ఏజెన్సీ స్టాక్‌హోమ్‌లో జరిగిన అమెరికా-చైనా చర్చల తర్వాత రెండు దేశాలు ఈ టారిఫ్ సస్పెన్షన్‌ను పొడిగించాలని సంయుక్త ప్రకటన విడుదల చేశాయని పేర్కొంది. చైనా కూడా తమ టారిఫ్ పెంపును 90 రోజులు నిలిపివేసి, 10% సుంకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. షిన్హువా ప్రకారం, జెనీవా జాయింట్ డిక్లరేషన్ కింద అమెరికాకు వ్యతిరేకంగా తీసుకున్న నాన్-టారిఫ్ చర్యలను నిలిపివేయడానికి లేదా తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా హామీ ఇచ్చింది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ తీవ్రత కొంతవరకు తగ్గవచ్చు.