iPhone : ఐఫోన్ తయారీకి టాటా గ్రూప్ బూస్టర్ డోస్..రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడి
రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడి
iPhone : టాటా గ్రూప్ తమ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యాపారాన్ని, ముఖ్యంగా ఐఫోన్ తయారీని, సెమీకండక్టర్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. తాజాగా కంపెనీ రిజిస్ట్రార్‌కు సమర్పించిన వివరాల ప్రకారం.. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్‌లో మరో రూ.1,500 కోట్ల అదనపు పెట్టుబడిని పెట్టింది. ఈ తాజా ఈక్విటీ పెట్టుబడితో కలిపి గత ఒక సంవత్సరంలో టాటా సన్స్ నుంచి టాటా ఎలక్ట్రానిక్స్‌లో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.4,500 కోట్లకు చేరింది. ఈ నిధులు టాటా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే గుజరాత్, అస్సాంలో రాబోయే సెమీకండక్టర్, అసెంబ్లీ యూనిట్లను విస్తరించడానికి ఉపయోగపడతాయి.
టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతం యాపిల్ కంపెనీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐఫోన్లను తయారు చేస్తోంది. భారత్‌లో ఐఫోన్లను తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ తయారైన ఐఫోన్లలో ఎక్కువ భాగం అమెరికా, యూరప్ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వేగవంతమైన పెట్టుబడి వెనుక, సంస్థ మెయింటెనెన్స్ కోసం దీర్ఘకాలిక అదనపు నిధులు అవసరమని కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో మరింత ఫండింగ్ అవసరం కావచ్చు అనే సంకేతాలను ఇస్తూ, కంపెనీ తన అధీకృత వాటా మూలధనాన్ని రూ.20,000 కోట్లకు రెట్టింపు చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా ఎలక్ట్రానిక్స్ మొత్తం ఆపరేటింగ్ ఆదాయం రూ.66,206 కోట్లుగా నమోదు కాగా, దాని నికర నష్టం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.825 కోట్ల నుంచి రూ.69 కోట్లకు తగ్గింది.
పెట్టుబడుల విస్తరణతో పాటు టాటా గ్రూప్ తమ టెక్నాలజీ భాగస్వామ్యాలను కూడా పటిష్టం చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో టాటా గ్రూప్ ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్ రాబోయే ఫ్యాక్టరీలలో భారతీయ మార్కెట్ కోసం ఇంటెల్ ఉత్పత్తులను తయారు చేయడం, ప్యాకేజింగ్ చేయడం, అధునాతన ప్యాకేజింగ్‌పై కలిసి పనిచేయడానికి అవకాశాలను అన్వేషిస్తారు. అంతేకాకుండా, వినియోగదారులు, ఎంటర్‌ప్రైజ్ మార్కెట్ కోసం కస్టమైజ్డ్ ఏఐ పీసీ సొల్యూషన్స్‌ను వేగవంతం చేసే అవకాశాలను కూడా ఈ రెండు సంస్థలు పరిశీలిస్తాయి.