Tech Layoff : టెక్ కంపెనీలకు కలిసిరాని 2025.. లక్ష మందికి పైగా ఉద్యోగుల తొలగింపు
Tech Layoff : టెక్ ఇండస్ట్రీకి 2025 ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 218 కంపెనీలలో 1,12,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.
Tech Layoff : టెక్ ఇండస్ట్రీకి 2025 సంవత్సరం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 218 కంపెనీలలో 1,12,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తొలగింపులకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్. అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, భారతీయ దిగ్గజం టీసీఎస్ వంటి పెద్ద సంస్థలు కూడా ఖర్చులను తగ్గించుకోవడం, వ్యాపారాన్ని పునర్నిర్మించడం, AI బేస్డ్ మెథడ్స్ వైపు మొగ్గు చూపడంతో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించాయి. ఈ పరిణామాలు టెక్ ప్రపంచంలో అనిశ్చితిని పెంచాయి.
2025 సంవత్సరం టెక్ ఇండస్ట్రీకి అత్యంత కష్టకాలంగా మారింది. ఉద్యోగుల తొలగింపుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదైంది. Layoffs.fyi నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు 218 టెక్ కంపెనీలలో 1,12,732 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ తొలగింపుల ధోరణి జనవరి, ఫిబ్రవరి నెలల నుంచే మొదలై, ఏప్రిల్ నెలలో 24,500 కంటే ఎక్కువ ఉద్యోగాలు పోయాయి. AI వినియోగం పెరుగుదల, మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యాపార పునర్నిర్మాణం వంటి కారణాల వల్ల ఈ తొలగింపులు మరింత వేగవంతమయ్యాయి. ఈ తొలగింపులు కేవలం చిన్న కంపెనీలకే పరిమితం కాలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఇంటెల్ వంటి సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
2025లో అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద తొలగింపులను ప్రకటించి, 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. ఈ కోతలు అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆపరేషన్స్,హెచ్‌ఆర్ విభాగాల్లో జరిగాయి. AI ఆధారిత ఆటోమేషన్, ఎక్కువ నియామకాలు దీనికి కారణమని సీఈఓ ఆండీ జెస్సీ తెలిపారు.కొత్త నాయకత్వంలో ఇంటెల్ కూడా తన ఉద్యోగులలో 22% అంటే సుమారు 24,000 మంది ఉద్యోగులను తొలగించింది. చిప్ పరిశ్రమలో పోటీ పెరగడం, AI బేస్డ్ సిస్టమ్ లపై దృష్టి సారించడమే దీనికి కారణం. భారతదేశ ఐటీ రంగం కూడా ఈ తొలగింపుల ధోరణి నుంచి తప్పించుకోలేకపోయింది.
భారతీయ దిగ్గజం టీసీఎస్ సెప్టెంబర్ త్రైమాసికంలో సుమారు 19,755 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యంత భారీ తొలగింపు. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. గ్లోబల్ డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై కంపెనీ దృష్టి పెట్టడం వల్ల, పాత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ తగ్గింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ సుమారు 9,000 మంది ఉద్యోగులను తొలగించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్‌లతో సహా అనేక టెక్, నాన్-టెక్ ఉద్యోగాలు పోయాయి. గూగుల్ కూడా క్లౌడ్, ఆండ్రాయిడ్, టీవీ విభాగాల్లో రౌండ్లవారీగా తొలగింపులు చేపట్టింది. సేల్స్‌ఫోర్స్ కంపెనీ తన సపోర్ట్ టీమ్‌లో 4,000 పోస్టులను AI ఆటోమేషన్ కారణంగా తొలగించింది. కస్టమర్ల సందేహాలలో 50% కంటే ఎక్కువ ప్రశ్నలను AI సిస్టమ్స్ పరిష్కరిస్తున్నాయని కంపెనీ అంగీకరించింది.